కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, పాపపు పాలన చేస్తున్నదని, ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నదని ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో బస చేసిన ఆయన, శనివారం ఉదయం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కౌన్సిలర్లు, ఇతర పార్టీ నేతలతో కలిసి కరీంనగర్ నుంచి బయలుదేరి వెళ్లారు.
అంతకు ముందు హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాతనపల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రభుత్వం, ఎన్నికల సంఘం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను సజావుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 22 స్థానాలు ఉన్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తుతో పోటీచేశాయని, బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాలు గెలిచాయని పేర్కొన్నారు. అయినా మా కౌన్సిలర్లను చైర్మన్, వైస్ చైర్మన్ కాకుండా ఏడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనేక కుట్రలు చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికే రెండు సార్లు గొడవ చేసి వాయిదా పడేలా చేసిందని విమర్శించారు.
పోలీసులను వాడుకొని, దౌర్జన్యాలు చేశారని, అణగదొక్కారని ఆరోపించారు. తనతో సహా 25 మందిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. రెండుసార్లు వాయిదా వేయడంతో తాము హైకోర్టును ఆశ్రయించామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఈ రోజైనా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని తాము ఆశిస్తున్నామన్నారు. కాంగ్రెస్ గుండాగిరి, దౌర్జన్యాలు బంద్ చేయాలని, ప్రజలకు ఎన్నికల ముందు ఏ హామీలు, వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందో వాటిని నిలబెట్టుకోవాలని హితవుపలికారు. బీఆర్ఎస్ హయాంలో బ్రహ్మాండంగా ఉన్న కరీంనగర్ రెండేళ్ల కాలంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో హైదరాబాద్‌లో పారిశ్రామిక భూములను దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని, రాష్ట్రంలో రియల్ పాలన లేదని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా సీఎం, మంత్రులు పనిచేస్తున్నారని విమర్శించారు.

ఇది బీఆర్ఎస్ డే : ఎమ్మెల్యే గంగుల
ఈరోజు తమకు బీఆర్ఎస్ డేగా నిలుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఫేలవంగా సాగుతున్నదని, ఈ క్రమంలోనే ఇబ్రహ్నీంపట్నం, కానాపూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుందని పేర్కొన్నా రు. కాంగ్రెస్‌పై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడే కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ప్రభు త్వం ఎన్ని ఆశలు చూపినా, ప్రలోభ పెట్టినా, బెదిరించినా పట్టించుకోకుండా ప్రజా తీర్పునకు కట్టుబడి ప్ర జాస్వామ్యాన్ని నిలబెట్టారని కొనియాడారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. క్యాతన్‌పల్లి ప్రజల తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో క్యాతన్‌పల్లి మున్సిపల్ బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లతోపాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీరా మకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.