Godavarikhani | కోల్ సిటీ,ప్టెంబర్ 22: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కర్రీ పాయింట్లు, బిర్యానీ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలపై ఇప్పటికీ రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలపై ఇక నుంచి క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరపాలని నిర్ణయించింది. ఈమేరకు వీధుల్లో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే వారు పరిశుభ్రత, సురక్షిత విధానాలు పాటించాలని నగర పాలక సంస్థ ఆడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ స్పష్టం చేశారు.
లోక్ కళ్యాణ్ మేళాలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం చిరు వ్యాపారులకు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ రూపొందించిన నియమావళిపై మెప్మా ఆధ్వర్యంలో శిక్షకులు ఈశ్వర భరద్వాజ్ చే అవగాహన కల్పించారు. నాసిరకం సరుకులతో తయారు చేసిన ఆహార పదార్థాలు విక్రయించడం వల్ల మనిషి శరీరంలో కలిగే దుష్పరిమాణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ ఆహారం ద్వారా సంక్రమించే అనారోగ్యాలను నివారించడానికి ఎఫ్ఎస్ఎస్ఏ రూపొందించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు.
ఆయా దుకాణాల్లో పని చేసే కార్మికులు శుభ్రత ప్రమాణాలు పాటించడం, నాణ్యమైన ముడి సరుకులు వినియోగించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల తప్పనిసరి బాధ్యత అని సూచించారు. వ్యాపార అభివృద్ధి కోసం బ్యాంకుల సహకారంతో సబ్సిడీ రుణాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, మెప్మా డీఎంసీ మౌనిక, సీఓలు ఊర్మిళ.. శ్వేత, ప్రియదర్శిని, శమంత తదితరులు పాల్గొన్నారు.