Finance business | కోల్ సిటీ, సెప్టెంబర్ 6: చక్కటి ప్రభుత్వ ఉద్యోగం… చక్కనైన జీతం.. ఇది చాలదనుకున్నాడో ఏమో గానీ.. మరో మార్గం ఎంచుకున్నాడు. అదే ఫైనాన్స్ బిజినెస్. ఇందులో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశపడ్డాడు. తన భార్యనే బినామీగా పెట్టుకొని తన డివిజన్లో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ పలు రకాలుగా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి బాగోతం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా అతనిపై చర్యలు తీసుకోకపోవడంలో రాజకీయ అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డివిజన్లో పెరుగుతున్న బాధితులు లబోదిబోమంటూ సదరు ఉద్యోగి ఆగడాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలోనూ సదరు ఉద్యోగి బిజినెస్ వ్యవహారంపై నగర పాలక సంస్థకు పలుసార్లు పిర్యాదులు రాగా, అధికారులు మందలించినట్లు తెలిసింది. ఐనప్పటికీ సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోకుండా ఎవరో ఒకరి అండదండలతో దర్జాగా బిజినెస్ నడుపుతున్నట్లు బాధితులు వాపోతున్నారు.
రూ. 100కు రూ. 10 వడ్డీ..
నగర పాలక సంస్థలో పని చేస్తున్న సదరు ఉద్యోగి తన డివిజన్ పరిధి మార్కండేయ కాలనీ, అడ్డగుంటపల్లి తదితర ప్రాంతాల్లో ఖాళీ జాగలకు ఇంటి నంబర్లు జారీ చేయించడం, కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇప్పించడం తదితర పనులకు ఎంతో కొంత పుచ్చుకొని పనులు చేస్తున్నట్లు గతంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇందులో వచ్చే చిన్నా చితక కమిషన్లు సరిపోవని భావించి ఏకంగా ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలిసింది. బినామీగా తన భార్య పేరుమీద రూ. వందకు పది రూపాయల వడ్డీ చొప్పున రూ. లక్షకు పదివేలు అత్యవసరమైతే రూ.12వేలు ఆపుకొని బ్లాంక్ చెక్ తీసుకొని అప్పులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పులు తీసుకున్న బాధితులు తిరిగి చెల్లింపు సమయంలో ఆలస్యమైతే అందుకు వడ్డీ రేటు పెంచి బలవంతంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇలాంటి వ్యవహారాలతో గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనట్లు తెలిసింది. అందులో భాగంగా గతంలో ఒక బాధితుడి వద్ద బ్లాంక్ చెక్ తనఖా పెట్టుకొని రూ.లక్ష అప్పు ఇవ్వగా, తిరిగి చెల్లింపు సమయంలో ఆలస్యం కావడంతో అతనిపై చెక్ బౌన్స్ కేసు వేసినట్లు తెలిసింది. ఆ వ్యవహారం ఇప్పటికీ కోర్టు వివాదంలో ఉన్నట్లు తెలిసింది. ఇలా ప్రతీ వివాదంలో తల దూర్చడం వల్ల గతంలో మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు రావడంతో అధికారులు మందలించి వదిలేసినట్లు సమాచారం.
ఇటీవల కాలంగా మళ్లీ వడ్డీ వ్యాపారం చేస్తూ ఆగడాలు పెట్రేగిపోతున్నా.. ఉన్నతాధికారులు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డివిజన్ ప్రజలు, బాధితులు ప్రశ్నిస్తున్నారు. అతడి వ్యవహార శైలిపై నగర పాలక సంస్థలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఉద్యోగిగా తన పలుకుబడి అడ్డు పెట్టుకొని రాజకీయ అండదండలతో వడ్డీ వ్యాపారం పేరుతో బాధితులను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అతడిపై విజిలెన్స్ విచారణ జరిపించి తమకు విముక్తి కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.