కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 25 : ‘మేమేం పాపం చేశాం. గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో వివక్షను ప్రశ్నిస్తే మాపై కేసులు నమోదు చేస్తారా..? అసలు గ్రామంలో వదిలి హామ్లెట్ విలేజ్లో జీపీ భవనం ఎలా నిర్మిస్తారు? అడ్డుకోబోయిన మాపై కాంగ్రెస్ కార్యకర్తలతో దాడి చేయించి, మమ్మల్నే తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తారా..? ప్రజాస్వామ్యానికి అర్థమిదేనా..?’ అంటూ అధికారుల ఎదుట తిమ్మాపూర్ మండలంలోని బాలయ్యపల్లి గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు.
పంచాయతీ భవన నిర్మాణానికి ఉచితంగా భూమి అందిస్తామని ప్రకటించినా.. ప్రభుత్వ భూమిలోనే నిర్మాణం చేపడుతామంటూ చెప్పడం వెనుక మర్మమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాలయ్యపల్లి గ్రామ హామ్లెట్ విలేజ్ సాహెబ్పల్లిలో నిర్మిస్తున్న జీపీ భవన నిర్మాణంపై బాలయ్యపల్లి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ప్రజావాణి’కి తరలివచ్చారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్కు వినతిపత్రం అందజేశారు.
ఊరి పేరున్న చోట భవనం నిర్మించాలని, లేదంటే రెండు గ్రామాలకు సమాన దూరంలో నిర్మించాలని కోరితే పట్టించుకోకుండా సాహెబ్పల్లిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంటే తాము వెళ్లి అడ్డుకున్నామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహించి వెనుదిరుగగా, కాంగ్రెస్ కార్యకర్తలు తమపై భౌతికదాడులకు దిగి గాయపర్చారని కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ తిమ్మాపూర్ తహసీల్దార్, ఎంపీడీవోలను పిలిచి సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇరు గ్రామాలకు అనుకూలంగా ఉండేలా పంచాయతీ భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట వినతిపత్రాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.