రాజన్న సిరిసిల్ల, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తిట్ల పురాణం బంద్ చేయాల ని, రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రహదారుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో తాను ఎంపీగా ఎన్నో జాతీయ రహదారులకు ప్రతిపాదనలు చేశానని గుర్తు చేశారు.
సంజయ్ ఐదేళ్లు ఎంపీగా పనిచేశారని, ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నందున తాను రాజకీయ విమర్శలు చేయడం లేదన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అభివృద్ధిని కాంక్షించి బండి దృష్టికి తీసుకువస్తున్నట్టు తెలిపారు. దుద్దెడ- సిరిసిల్ల రహదారిని కోరుట్ల వరకు పొడిగించాలని, తంగళ్లపల్లి ఊరు బయటి నుంచి వెళ్తున్న రైల్వే ట్రాక్ పక్క నుంచే రోడ్డు వేయాలని, మానేరు నదిపై 1.8 కిలోమీటర్ల రోడ్‌కం రైల్వే బ్రిడ్జికి గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు పంపామని, పనులు ఆరంభ దశలో ఉన్నందున రాజమండ్రి తరహాలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.
ఈ వంతెనతో ఆ ప్రాంతం టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందని, దానిపై నుంచి వేములవాడ ఊరి బయట మీదుగా చందుర్తి, కథలాపూర్, కోరుట్ల వరకు ముక్కుసూటిగా రహదారి ఉంటుందని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ రాజకీయాలను పక్కన పెట్టి జిల్లా అభివృద్ధి కోసం పాటు పడాలని హితవుపలికారు.
సూర్యాపేట, సిద్దిపేట- సిరిసిల్ల, వరంగల్- కరీంనగర్- సిరిసిల్ల-కామారెడ్డి-పిట్లం వరకు రెండు జాతీ య రహదారుల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతిపాదనలు చేశారని, అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జనగామ-సిద్దిపేట రహదారి పనులు తుదిదశకు వచ్చాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు చేపడుతున్న 365బీ జాతీయ రహదారిని వేములవాడ, చందుర్తి, కథలాపూర్ మీదుగా కోరుట్ల వరకు పొడిగించాలని, అందుకు కేంద్రానికి ప్రతిపాదనలు చేయాలని కోరారు.
ఈ జాతీయ రహదారి పొడిగించడం వల్ల వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చి పోయే భక్తులకు హైదరాబాద్ వెళ్లేందుకు మార్గం సులువుగా ఉంటుందన్నారు. ప్రస్తుత సిరిసిల్ల-సిద్దిపేట రహదారి ఓ పాములాగా వంకరటింకరగా దాదా పు 39 మలుపులున్నదని, ఈ మలుపులు తొలగిస్తూ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వస్తుందన్నారు. ఢిల్లీలో పనులపై ఫాలోఅప్ చేస్తేనే మం జూరవుతాయని చెప్పారు.
సమావేశంలో టూరి జం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, చేనేత జౌళీశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, బొల్లి రామ్మోహన్, రాఘవరెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్ల బయటి నుంచే చేపట్టాలి
సిరిసిల్ల పట్టణ నడిబొడ్డు నుంచి జాతీయ రహదారి నిర్మిస్తే పేద, మధ్య తరగతి ప్రజలు భూములు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే పట్టణంలోకి ప్రవేశించకుండా బయటి నుంచి చేపట్టాలి. రోడ్‌కం రైల్వే బ్రిడ్జి నిర్మించాలి. అందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలి. కాగా, జిల్లాకు వచ్చిన రెండు జాతీయ రహదారులతో సిరిసిల్ల జంక్షన్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి అదనంగా డబ్బులు చెల్లించాలి. లేని పక్షంలో నిర్వాసితులతో కలిసి ఉద్యమిస్తాం.
– వినోద్ కుమార్