Algunur | తిమ్మాపూర్, ఆగస్టు 6 : అనుమానాస్పదస్థితిలో ఆయుర్వేద వైద్యుడి మృతి చెందాడు. ఈ సంఘటన అలుగునూరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన మారం సంపత్ అనే వ్యక్తి అల్గునూరులో కొన్నేళ్ల క్రితం నుండి ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మహిళ వైద్యం కోసం సంపత్ వద్దకు వచ్చింది.
అనంతరం వైద్యం చేయించుకున్నట్టు వెళ్లిన ఆమె కొద్దిసేపటికి హడావుడిగా బయటకు వెళ్లి ఆటోలో వెళ్లింది. ఎంతసేపటికి సంపత్ బయటకు రాకపోవడంతో బయట కూర్చున్న అతడి కొడుకు లోపలికి వెళ్లి చూసేసరికి నురుగులు కక్కుతూ అచేతన స్థితిలో పడి ఉంది. దీంతో భయపడిన ఆయన చుట్టుపక్కల వారికి కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. వారు వచ్చి ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.