Farmers | కమాన్ పూర్, మే 30: మండలంలోని గుండారం, సిద్దపల్లి, నాగారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కేవికే రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో వికాసిత్ కృషి సంకల్యాప్ అభియాన్ అనే పేరిట ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని వ్యవసాయ శాఖ డివిజన్ ఏడిఏ అంజనీ, కేవీకే రామ గిరి ఖిల్లా శాస్త్రవేత్తలు వెంకన్న, కిరణ్, హైదరాబాద్ ఐసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్తలు సురేష్, బాబ్జీ, పాల్ యాదవ్, గిరీష్ సీనియర్ శాస్త్రవేత్త ఎన్ఎమ్ఆర్ఐలు పాల్గొని రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సీజన్ కి సిద్ధంగా ఉండాలన్నారు. అదేవిధంగా సహజ వ్యవసాయ సాగు పద్ధతులు, ముందస్తు సాగు విధానం గురించి ప్రత్యేకంగా వివరించారు. అదేవిధంగా అధీకృత విత్తన షాప్ ల్లో నే విత్తనాలు కొనుగోళ్లు చేయాలన్నారు. విత్తన రశీదులు పంట కాలం పూర్తి అయ్యేవరకు దగ్గర భద్రంగా పెట్టు కోవాలన్నారు. అధిక దిగుబడులు ఇచ్చే చీడపీడలు తట్టుకునే విత్తనాలు విత్తుకోవాలన్నారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు.
రసాయనిక ఎరువులు వాడకం తగ్గించుకోవాలన్నారు. పశువుల పేడ, కోళ్ళ ఎరువు, తదితర సేంద్రీయ ఎరువులు వాడాలన్నారు. నాటు వేయడానికి ముందు పచ్చిరొట్ట ఎరువు పంటలు వేసి భూమి లో కలియ దున్నాలని చెప్పారు. పురుగు మందులు అవసరానికి మించి వాడకూడదన్నారు. ఎరువులు యాజమాన్యం చీడపీడల యాజమాన్యం పంట తొలి దశల నుండి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఏ ఈ ఓ లు అనుష, శ్వేతతో పాటు రైతులు పాల్గొన్నారు.