కోనరావుపేట, అక్టోబర్ 22 : వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి చేస్తూ, సాంకేతికతను వినియోగించి వ్యవసాయం చేయాలని జర్మనీ ఫ్రౌన్ హోఫర్ హెచ్‌హెచ్‌ఐ డాక్టర్ సెబాస్టియన్ సూచించారు. కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామాన్ని జర్మనీ బృందం, శాస్త్రవేత్తలతో కలిసి ఆయన సందర్శించారు. గ్రామంలో ఆకారాట్ ప్రాజెక్టు కింద ఆధునిక సాంకేతికతో వ్యవసాయం చేస్తున్న రైతుల పంటచేలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోని పాల్గొని రైతులతో మాట్లాడారు. ఆకారాట్ ప్రాజెక్టు కింద పంట సాగు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు? దిగుబడి ఎలా ఉన్నది? ఏవైనా సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారా? అంటూ రైతులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు స్మార్ట్‌ఫోన్ ఆప్‌ల ద్వారా వివరించేందుకు నూతన మార్గాలను అన్వేషిస్తామని వెల్లడించారు. తద్వారా సాగులో రైతులు ఉత్పత్తిని పెంచేందుకు, వాతావరణ మార్పులను ప్రతిఘటించేందుకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత వృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. అలాగే, ఇక్కడి రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న తీరును అభినందించారు.
రాబోయే రోజుల్లో అధునూతన పద్ధతులతో వ్యవసాయం చేసి, దిగుబడి పెంచేలా తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఇక్కడ డాక్టర్ రఘు చలిగంటి, జాన్మిస్టర్, జర్మనీ ఫెడరల్ మంత్రిత్వశాఖ మిస్టర్ మార్టిన్, అగ్రిహబ్ విజయ్, సేవ్స్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ, సొసైటీ చైర్మన్లు ముత్యాల కిషన్‌రెడ్డి, కౌడుక రమేశ్, రైతులు పాల్గొన్నారు.