వేములవాడ టౌన్, నవంబర్ 3: సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని, రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారాలు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథా సంపుటి, వ్యాస సంపుటి, ఆధ్యాత్మిక గ్రంథాల పోటీల్లో విజేతలకు వేములవాడ పట్ణణంలోని మల్లారం రోడ్డులో జవహర్లాల్ నెహ్రూ బీఈడీ కాలేజీలో ఆదివారం పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా ఆది శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. వేములవాడ ప్రాంతానికి చెందిన సినారె సహా న్యాయమూర్తి జింబో (మంగారి రాజేందర్), తదితరులు తెలుగు సాహిత్యంలో ఉద్దండులుగా ఎదిగారని గుర్తు చేశారు. వేములవాడలో జేఎన్ఎంఎస్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ విద్యావేత్త ఈశ్వరగారి నరహరిశర్మ అతని సతీమణి ముక్తేశ్వరి స్మారకంగా సాహిత్య పురస్కారాలను ప్రదానం చేయడం వారి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు.
ఈ సందర్భంగా వేములవాడ అనువంశిక రచయిత చొప్పకట్ల భానుశర్మ రచించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన గ్రంథాన్ని ఈశ్వరగారి నరహరిశర్మ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గిరిజ మనోహర్‌బాబు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సాహిత్యం సామాజిక విలువలను ఉన్నతీకరించేందుకు, కొంగొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన బీఎస్ రాములు మాట్లాడుతూ సాహిత్యంలో ఉన్నత విలువలను పెంచడానికి ఈ పురస్కారాలు రుజువు చేస్తున్నాయని తెలిపారు. కథాసంపుటి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన న్యాయమూర్తి, మంగారి రాజేందర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో కథ సాహిత్యం గొప్ప విస్తృతిని కలిగి ఉన్నదన్నారు.
అనంతరం 77 వసంతాలు పూర్తిచేసుకున్న నరహరిశర్మను పలువురు ప్రముఖులు సత్కరించారు. కాగా, వచ్చే సంవత్సరం నుంచి కవితా సంపుటి విభాగంలో ఎంపికైన రచనకు కూడా తన సతీమణి ముక్తేశ్వరి పేరిట సాహితీ పురస్కారం అందిస్తామని నరహరిశర్మ ప్రకటించారు. అనంతరం రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కొమురవెల్లి రాజేందర్, ప్రముఖ రచయిత, చరిత్రకారులు సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర్ జర్నలిస్ట్ పీఎస్ రవీంద్ర తదితరులను నిర్వాహకులు సత్కరించారు.
అలాగే సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ప్రముఖ రచయితలు డాక్టర్ నమిలకొండ సునీత, నాయిని సుజనాదేవి, డా.అమరవాది నీరజ, ముని సురేశ్ పిైల్లె, గర్రెపల్లి అశోక్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, వేణుశ్రీ, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, యోగాచార్య, సంపత్‌కుమార్, ఆడెపు లక్ష్మీపతి, దూరదర్శన్ రిటైర్డ్ అధికారి కృష్ణారావు, గోసంరక్షకులు, సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ, తెలంగాణ పత్రిక పూర్వ సంపాదకులు అష్టకాల రామ్మోహన్‌శర్మ ,ప్రముఖ వ్యాఖ్యాత మడుపు దక్షిణామూర్తి, ఆకాశవాణి ఆర్టిస్ట్ సమ్మెట నాగ మల్లేశ్వరరావును నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ ఉచ్చిడి మోహన్‌రెడ్డి, జవహర్ లాల్ విద్యాసంస్థల నిర్వాహకులు ఈశ్వరగారి రమణ, శుభ చరణ్, జీఎస్ మోహన్, నమిలకొండ జయంత్, చొప్పకట్ల వేణు, గర్శగుర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.