విద్యారంగంలో విశేష సేవలు అందించినందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ శనివారం పేర్లు ప్రకటించింది. వీరిలో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల నుంచి ఇద్దరు చొప్పున, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు.
తిమ్మాపూర్, సెప్టెంబర్ 2: విద్యారంగంలో ఉత్తమ బోధన, సేవలు అందించినందుకు రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను విద్యా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురికి అవార్డులు దక్కాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల భాగ్యరేఖ, వీర్నపల్లి మండలం రంగంపేట ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కోత్వల్ ప్రవీణ్, జగిత్యాల జిల్లా నుంచి కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోధ్యాయుడు అంబటి వెంకట్రాజం, రాయికల్ మండలం రామారావుపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్, పెద్దపల్లి జిల్లా నుంచి ఓదెల మండలం కొలనూరు ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు తోట రాజు ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లా నుంచి తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని డైట్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న కొడిచర్ల శంకర్‌కు సీనియర్ లెక్చరర్స్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రకటించింది.
కొలనూరు బడిలో రాజు సర్ ముద్ర
కొలనూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తోట రాజు తనదైన ముద్ర వేసుకున్నాడు. పేద కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఉపాధ్యాయుడు రాజు ఈ పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల బాగోగులు చూస్తూ సర్కారు బడి ఉన్నతికి కృషి చేస్తున్నాడు. కొలనూర్ బడిలో సైతం పాఠశాలకు కావాల్సిన అవసరాలను పూర్వ విద్యార్థులు, గ్రామస్తులతో సమకూర్చుకోవడంతోపాటు పేద విద్యార్థులకు విరాళాల రూపంలో కావాల్సినవి సమకూర్చడానికి కృషి చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సక్సెస్ అయ్యారు. రాజు కృషి ఫలితంగా ఇక్కడి బడి ప్రైవేటుకు ధీటుగా నడుస్తున్నది.
అంకితభావంతో పనిచేస్తున్నా..
మా స్వస్థలం జమ్మికుంట మండలం తనుగుల. అక్కడి సర్కార్ బడిలో 7 వరకు, వావిలాలలోని ఆదర్శ బలసదన్లో పదో తరగతి వరకు, జమ్మికుంటలో ఇంటర్, హనుమకొండ డైట్ కళాశాలలో డీఎడ్ పూర్తి చేశా. 2005లో ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలం పెద్దతూండ్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి 2009 వరకు పని చేశా. 2009 నుంచి 2018 వరకు ఓదెల మండలంలోని నాంసానిపల్లిలో, 2018 నుంచి కొలనూర్ పని చేస్తున్నా. రాష్ట్రస్థాయిలో నాకు ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా వృత్తిలో అంకితభావంతో పని చేస్తున్నా. అందుకే ప్రభుత్వం గుర్తించింది. ఎలాంటి పైరవీలు లేకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేసిందనడానికి నేనే నిదర్శనం. నా తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ఉన్నతాధికారులు, పూర్వ విద్యార్థులందరి సహకారంతోనే ఈ అవార్డు దక్కింది. వారందరికీ కృతజ్ఞతలు.
– తోట రాజు, ఉపాధ్యాయుడు, కొలనూర్ ప్రాథమిక పాఠశాల
నా కృషికి దక్కిన ఫలితం
విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో విద్యాబోధన అందించినందుకు ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ప్రాథమికస్థాయిలో విద్యార్థులకు చాలా సులభంగా అర్థమయ్యేలా బోధించినందుకు ప్రతి ఏడాది టీఎల్ఎం ప్రోగ్రాంలో జిల్లా స్థాయిలో చాలా సార్లు అవార్డులు వచ్చాయి. ఇలా పాఠశాల నుంచి రూపొందించిన టీఎల్ఎం ప్రాజెక్టును బోధనలో అందుబాటులోకి తీసుకువచ్చాం. పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులు, విద్యార్థుల సంఖ్య పెంచడంలో చేసిన కృషితో నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా.
– కోత్వల్ ప్రవీణ్, హెచ్ఎం (రంగంపేట ఎంపీపీఎస్ స్కూల్)
మరింత బాధ్యతను పెంచింది
రాష్ట్ర ప్రభుత్వం నన్ను రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపిక చేయడం సంతోషం కలిగించింది. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తులు, తల్లిదండ్రులు, యువకుల సహకారం మరువలేనిది. సమష్టి కృషి ఫలితంగా పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. నేనే ఈ పాఠశాలలో ఎనిమిదేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నా. విద్యార్థుల శాతం పెంచడం, డ్రాప్‌ఔట్ తగ్గించడం, హరతహారం ద్వారా పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచడం, విద్యార్థులతో నూతన ఆవిష్కరణలను రూపొందించడం, దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధ్దికి కృషి చేయడం, మెరుగైన విద్యాబోధన, పరీక్ష ఫలితాల్లో పాఠశాలను ముందంజలో ఉంచడం వంటివి చేసినందుకు నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు భావిస్తున్నా. రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉన్నత, లక్ష్యసాధన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు సాధిస్తా.
– అంబటి వెంకట్రాజం, హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్ పాఠశాల, పైడి మడుగు
సీనియర్ లెక్చరర్స్ విభాగంలో డైట్ సర్..
సీనియర్ లెక్చరర్స్ విభాగంలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని డైట్ కళాశాలలో పని చేస్తున్న కొడిచర్ల శంకర్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘంగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. ఉపాధ్యాయ వృత్తిలో ఆయనకు 34 ఏండ్ల అనుభవం ఉండగా.. 2003లో డైట్ కళాశాల లెక్చరర్‌గా ప్రమోషన్ పొందారు. 2009 నుంచి తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని కరీంనగర్డైట్లో సీనియర్ లెక్చరర్‌గా ఉంటూనే జిల్లా పరిషత్ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి సమీపంలోని బండలింగాపూర్ గ్రామానికి చెందిన శంకర్ గత సంవత్సరం రిటైర్డ్ కావాల్సి ఉన్నా.. ప్రభుత్వం పెంచిన వయసు నిబంధనతో వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే, ఈ కారణంగానే తనకు అవార్డు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన డైట్ విద్యార్థులకు, టీచర్లకు అభ్యాసన శిక్షణలు ఇవ్వడంతో పాటు పుస్తకాల సెలబస్ రివ్యూ చేస్తుంటారు. కాగా, రాష్ట్రస్థాయిలో ఈ విభాగంలో ఈయనొక్కరికే అవార్డు రావడం విశేషం.
బడి అభివృద్ధికి అభయ్‌రాజ్ కృషి
రాయికల్ మండలంలోని రామారావుపల్లె ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషికి గానూ ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్రాజ్కు రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది. ఆయన గత 12 ఏండ్లుగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. బోధనలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం, దాతల సహకారంతో వనరులను అభివృద్ధి చేయడం, గుణాత్మక విద్యా సాధనకు, పాఠశాల అభివృదిలో సమాజ భాగస్వామ్యం కోసం కృషి చేసినందుకు ఆయనను ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా
ప్రస్తుతం నేను ప్రధానోపాధ్యాయిగా పని చేసే పాఠశాలలోనే పదో తరగతి వరకు చదువుకున్నా. ఇదే పాఠశాలలో విద్యా బోధన చేసే అదృష్టం లభించడం చాలా సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్ సార్ ప్రత్యేక చొరవతో మా పాఠశాలను ప్రభుత్వం 2021 సంవత్సరంలో అత్యాధునిక వసతులతో రాష్ర్టానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దింది. ఇది మాకు గొప్ప అవకాశం. వారి నమ్మకానికి అనుగుణంగానే మా పాఠశాల నుంచి గతేడాది కార్పొరేట్‌కు దీటుగా పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాం. ఈ ఏడాది జిల్లాకు వచ్చిన రెండు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల్లో ఒకటి నాకు రావడం సంతోషంగా ఉంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా.
– నాగుల భాగ్యరేఖ, హెచ్ఎం(సిరిసిల్ల, గీతానగర్ స్కూల్)