హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా కోట్లాది రూపాయల ఖర్చుతో పెంచిన మొక్కలు ఎదుగకముందే బుగ్గిపాలవుతున్నాయి. ఇన్నాళ్లూ నిత్యం సంరక్షణతో నడి ఎండల్లో సైతం ఆకుపచ్చ రంగును సంతరించుకుని ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీస పర్యవేక్షణ కరువవడం, అధికార నేతలు చోద్యం చూస్తుండడంతోనే ఈ దుస్థితి దాపురించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కలెక్టరేట్, ఏప్రిల్ 20: సీమాంధ్రుల పాలనలో పాలకుల విచ్చలవిడి విధానంతో జిల్లాలో అటవీ సంపద తగ్గింది. కాలుష్య కారకాలు పెట్రేగి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగింది. ముఖ్యంగా వాయు కాలుష్యం వెదజల్లడంలో దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. స్వరాష్ట్ర కల సాకారమైన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుష్యాన్ని అరికట్టి ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రకటించి, అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పాలనాపగ్గాలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, తెలంగాణ పోరాట స్ఫూర్తితో హరిత ఉద్యమానికి నాంది పలికారు. ప్రతి ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకు ప్రజలు, అధికారులకు లక్ష్యం విధించి మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ, అక్కడా అని కాకుండా ప్రభుత్వ, పరంపోగు, బంచరాయి, గుట్టలు, రోడ్లు, ఇళ్ల పక్కన, వ్యవసాయ భూముల్లోని పొలం గట్లపై కూడా మొక్కలు నాటించారు. వాటి సంరక్షణ బాధ్యతలు గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలతో పాటు గ్రామాల్లోని పంచాయతీలు, రైతులకు అప్పగించారు. సంరక్షణపై నిర్లక్ష్యం వహించే యంత్రాంగం, ప్రజాప్రతినిధులపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులను పురమాయించారు. వరుసగా తొమ్మిదేళ్లపాటు పట్టువదలని విక్రమార్కుడిలా హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపగా, నాడు నాటిన కోట్లాది మొక్కలు నేడు వట వృక్షాలుగా ఎదిగాయి. ఫలితంగా కరీంనగర్ జిల్లా పచ్చదనానికి చిరునామాగా మారింది. ఎనిమిది శాతమున్న అటవీ సంపద 12 శాతానికి పెరిగినట్లు అధికారుల గణాంకాలు వెల్లడించాయి.
ఒక్క ఏడాదిలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కరువైంది. వాటికి నీరు పోయాలని పురమాయించేందుకు పాలక వర్గాలు లేవు. అధికారుల పట్టింపు అంతకన్నా లేదు. చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. దీంతో, పంట పొలాల్లోకి నీడ వస్తున్నదంటూ రైతులు, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్నాయంటూ విద్యుత్ శాఖ సిబ్బంది ఇషారీతిగా నరికివేస్తున్నారు. మరోవైపు నరికిన మండలు ఎక్కడికక్కడే వదిలేయగా, ధూమపాన ప్రియులు తాగి విసిరేసే బీడీ, సిగరేట్లతో అగ్గిరాజుకుని, బుగ్గిపాలవుతున్నాయి. వాటి అవశేషాల బూడిద రహదారులపై వెళ్లే ప్రయాణికుల కళ్లను కప్పుతుండగా, ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. జిల్లాలోని శనిగరం నుంచి మొదలు దుబ్బపల్లి వరకు, కరీంనగర్ నుంచి గంగాధర, ఒద్యారం, చొప్పదండి వరకు రహదారులకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లతో సంతరించుకున్న పచ్చదనం కనుమరుగవుతున్నది. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో ప్రయాణం చేసే తమకు చెట్ల నీడ కరువవుతున్నదంటూ బాటసారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అవెన్యూ ప్లాంటేషన్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరమున్నదనే అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి.