AamudalaPally | శంకరపట్నం : మండలంలోని ఆముదాలపల్లి శివారులో ఆటో బోల్తా పడగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. రాజాపూర్ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన మహిళా కూలీలు వీణవంక మండలంలోని ఓ గ్రామంలో ఉదయం మొక్కజొన్న కంకి తీసేందుకు వెళ్లారు.
మధ్యాహ్నం సమయంలో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఆముదాల పల్లి శివారులో ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి బ్రిడ్జి కింద బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కనకం అంజయ్య, అతని భార్య సారమ్మ, కోడళ్లు నందిని, సంగీతో పాటు కుక్కముడి వీరయ్య, ఇతడి భార్య ఎల్లమ్మ, మాతంగి మదనమ్మ, మాతంగి శంకరమ్మకు గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారంతో చేరుకున్న కుటుంబ సభ్యులు వేర్వేరు వాహనాలలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజురాబాద్, కరీంనగర్ కు తరలించారు. వీరిలో ఆటో డ్రైవర్ అంజయ్య, మదునమ్మ, శంకరమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంజయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించారు. కేశవపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.