Auto drivers | కరీంనగర్ తెలంగాణ చౌక్ మే 2 : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో సంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత నెల 25న మెదక్ లో ప్రారంభించిన ఆటో రథయాత్ర కరీంనగర్‌కు శుక్రవారం చేరుకుంది. కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ర్యాలీగా తెలంగాణ చౌక్‌కు చేరుకొని ఆటోడ్రైవర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్ లోకల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆటో డ్రైవర్లకు కిరాయిలు లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఉచిత ప్రయాణ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఉపాధి కూలిపోయిన ఆటో డ్రైవర్లకు జీవన భృతి అందించాలని కోరారు.
కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి వలన జీవితాలు భారంగా మారి 85 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియాఅందించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రులను ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు అందించి మొరపెట్టుకున్నా కూడా తమ బాధలను ఆలకించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన వస్తుందని ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇదే నా ప్రజాపాలన అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఆటో కార్పొరేషన్ ప్రతి ఆటోడ్రైవర్‌కు జీవన భృతి ఇన్సూరెన్స్ పై సబ్సిడీ రూ.ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈనెల 27న హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ల ఆకలికేక భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడ్డు కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల రాజేందర్, నాయకులు సంపత్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.