Huzurabad | హుజూరాబాద్ టౌన్, మే 28 : దళిత యువకుడు బత్తుల మహేందర్ ను చితకబాదిన సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ ను అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, సీపీకి తప్పుడు నివేదికలు అందించారని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ ఆరోపించారు. పట్టణంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సై భార్గవ్ ను పట్టించుకోకుండా, మహేందర్ ఫోన్లో మాట్లాడుతున్నాడనే అహంకార ధోరణితోనే మహేందర్ పై ఎస్సై దాడి చేశాడని అన్నారు. కర్ణబేరీలు దెబ్బతినేలా ఎస్సై తీవ్రంగా కొట్టారని అన్నారు. ఈ క్రమంలో ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, కొంత మంది పోలీస్ అధికారులు తప్పుడు నివేదికల సీపీకి అందించారని అన్నారు. దీంతో, న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ కు, రాష్ట్ర, జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించి ఈ కేసు విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్)కి , సీపీకి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మహేందర్ పై దాడిని దళిత జాతీపై దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఎస్సై చేసిన దాడి పోలీస్ డిపార్ట్మెంట్ కే అపకీర్తి తెస్తుందని అన్నారు. దాడి చేసిన ఎస్సైని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్, న్యాయవాది జీడి రవితేజ, యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.