Basara temple | జగిత్యాల మే 18 : నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టిబిఎస్ఎస్ఎస్) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయసారధి తెలిపారు. ఆదివారం జగిత్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా స్థానిక బ్రాహ్మణ సంఘ బాధ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
దైవసేవలో నిమగ్నమైన బ్రాహ్మణ పూజారి సంజీవ్ పై దాడి చేయడం అమానుషమని, మరొక మారు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దాడికి సంబంధించిన పూర్వపరాలు పరిశీలించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అర్చకులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డాక్టర్ సముద్రాల విజయసారథి కోరారు.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు . అంతే కాకుండా బ్రాహ్మణులను అవహేళన పరిచే విధంగా వ్యవహరిస్తున్న వారిపై శిక్షించడానికి ప్రత్యేక చట్టం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో టీబీఎస్ఎస్ యువ నాయకులు గోవర్ధనగిరి ధీరజ్ కృష్ణమాచారి, నమిలకొండ యశస్వి భరద్వాజ్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చాకుంట వేణు మాధవరావు, సిరిసిల్ల రాజేంద్ర శర్మ తదితరులు ఉన్నారు.