కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. ఈ నెల 17 నుంచి వరుస ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోరాటం ఉధృతం చేస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మానవహారాలుగా ఏర్పడ్డారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందించారు. తమ సమస్యలు పరిష్కరించాలని వరుస ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, శ్రమకు తగ్గట్టుగా నెలకు 18వేల నికర వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండ్రోజుల కింద హైదరాబాద్లోని ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి వెళ్లకుండా ఉక్కుపాదం మోపారని భగ్గుమంటున్నారు.
తమకు కనీసం నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అరెస్టులతో విరుచుకుపడడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇలాగే నిర్బంధాలు కొనసాగితే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Karimnagar0