చిగురుమామిడి, ఆగస్టు 19 : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ప్రతినెల 30వ తేదీలోగా పారితోషకం చెల్లించాలన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశలకు 18 వేల వేతనాలు నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియల్ వెంటనే చెల్లించాలన్నారు. ఏఎన్ఎం పోస్టులలో డైరెక్ట్ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, లేదా వెయిటేజీ మార్కులు నిర్ణయించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 25న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగిందని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత అన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నాగవెల్లి పద్మ, మండల కార్యదర్శి బోయిని ప్రియాంక, నాయకులు కల్పన, అంజలి, లక్ష్మి, సునీత, సరోజన తదితరులు పాల్గొన్నారు.