కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 23 : రెండేళ్ల కిత్రం కరీంనగర్లో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్‌ను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి ఎందుకూ అక్కరకు రాకుండా పోయాయి. ఆరు ప్రాంతాల్లో సుమారు 14 బిన్స్‌ను రూ.కోటికిపైగా వ్యయం చేసి కొనుగోలు చేశారు. అందులో మూడు ప్రాంతాల్లో బిగించారు. వేసిన చెత్తను తొలగించేందుకు కొనుగోలు చేసిన వాహనాన్ని సైతం పక్కన పెట్టడంతో ఆయా ప్రాంతాల్లో బిగించిన బిన్స్ అధ్వానంగా మారాయి.
అలాగే, మిగిలిన బిన్స్ అన్ని కార్యాలయంలో ఓ మూలన పడేశారు. వినియోగించే విషయంలో సృష్టత లేకుండానే ఎందుకు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు డంపర్ బిన్స్ కూడా శిథిలావస్థకు చేరడంతో వీటిల్లో వేసిన చెత్త డంప్ యార్డుకు తరలించే సమయంలో రంధ్రాల నుంచి రోడ్లపై చెత్త పడిపోతున్నది. మరమ్మతులు చేయాలని పారిశుధ్య విభాగం అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
అండర్ గ్రౌండ్ బిన్స్ కొనుగోలు చేయడం వల్ల వీటి అవసరం లేదన్నట్లుగా ఉన్నతాధికారులు పేర్కొంటూ వచ్చారు. కానీ, అండర్ బిన్స్‌ను కూడా ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో ఇన్నాళ్లుగా ఇబ్బందిగానే కొనసాగిస్తూ వస్తున్నారు. కోట్లాది రూపాయాలు వ్యయం చేసి కొనుగోలు చేసిన అండర్ బిన్స్, వాహనాలను ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదన్న విషయంలో అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, నగరంలో చెత్త తరలింపు విషయంలో విమర్శలు వస్తుండడంతో నగర ఉన్నతాధికారులు అండర్ బిన్స్ వినియోగించే విషయంలో దృష్టి సారిస్తున్నారు. అయితే గతంలో వివిధ ప్రాంతాల్లో బిగించిన అండర్ బిన్స్‌లో చెత్త ఉండడం వాటిని పట్టించుకోకపోవడంతో అవి కూడా మరమ్మతులకు వచ్చినట్లు అధికారులు చెప్పుతున్నారు. వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చే విషయంలో ఉన్నతాధికారులు చర్యలు చేపడుతుండడం విచిత్రంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.