జగిత్యాల టౌన్/రూరల్, డిసెంబర్ 8: ‘బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా మేం విద్యాలయాల సందర్శనకు వెళ్తుంటే అడ్డుకుంటున్నరు. అనుమతి లేదని వెళ్లగొడుతున్నరు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే తాము వెళ్లకుండా గేట్లకు తాళాలు ఎందుకు వేస్తున్నరో చెప్పాలి. కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన అని’ జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో విలేకరులతో ఆమె మాట్లాడారు.
గురుకులాల్లో అన్నీ సమస్యలేనని, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో పడేశారని ధ్వజమెత్తారు. మౌలిక వసతులు లేవని, పరిశుభ్రత కొరవడిందని, నాణ్యత లేని ఆహారం అందిస్తుండడంతో విద్యార్థులు దవాఖానల పాలు కావాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఇటీవల రాయికల్ మండలం అల్లీపూర్‌లోని పాఠశాలకు వెళ్తే గేట్లకు తాళాలు వేసి తమను లోనికి రానివ్వలేదని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. గడిచిన ఏడాదిలో 50 మంది విద్యార్థులు చనిపోయారని, ఉపాధి లేక సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఉచిత బస్సులు వద్దంటే మానేస్తామని, ఓ మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మంథెన మధు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం, పట్టింపులేమితో గురుకులాల్లో ఏడాది కాలంలోనే 50 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. గురుకుల పాఠశాలలో ఆరు నెలలుగా కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదని, సమస్యలు పరిష్కరించేందుకు కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అభ్యున్నతి కోసమే గత ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ వాటిని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నదని జగిత్యాల జిల్లా గురుకుల పాఠశాల ఇన్చార్జి జక్కుల వెంకటేష్ మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ రామడుగు రాజేశ్, విద్యార్థి విభాగం నాయకుడు నాగేందర్ పాల్గొన్నారు.