NYP | కోల్ సిటీ, జూన్ 24: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలతో అధికారులు, పాలకులు కృత్రిమ ఆనందం పొందుతున్నారని ఎన్ వైపీ జాతీయ ఉపాధ్యక్షులు అశోక్ వేముల ధ్వజమెత్తారు. ఈమేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50 యేళ్లుగా ఉన్న ప్రజల ఆస్తులను ఏడాదిన్నర కాలంగా అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తూ కాంగ్రెస్ నాయకులకు ఏజెంట్లుగా వ్యవహరించడం మానుకోవాలని అన్నారు.
ఇప్పటివరకు ఆస్తులు కోల్పోయిన బాధితులకు రూ.10లక్షలు నష్ట పరిహారం కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ పలానా ప్రాంతంలో దుకాణాలు కూల్చివేయాలని చెప్పడం ఏలాంటి నోటీసులు లేకుండా వాటిని కూల్చివేసి బాధితులను రోడ్డు పాలు చేయడం లాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గోదావరిఖని బస్టాండ్ వద్ద దుకాణాలు, లక్ష్మీనగర్, మార్కండేయ కాలనీ, కళ్యాణ్‌నగర్, తిలకనగర్, ప్రధాన చౌరస్తా, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లో కూల్చివేతలతో అనేక మంది వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారనీ, కూల్చివేసిన స్థలాల్లో ఏమైనా అభివృద్ధి పనులు చేస్తున్నారా అంటే అదీ లేదనీ, పైగా ఇతరులకు ఆ స్థలాల్లో దుకాణాలు నిర్మించుకోమని నాయకులు చెప్పడం, ఆ మాటలు నమ్మి అక్కడ దుకాణాలు నిర్మించుకున్నాక మళ్లీ కార్పొరేషన్ అధికారులు వచ్చి అనుమతులు లేవంటూ మళ్లీ కూల్చివేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
ఊరంతా కూల్చివేసి చివరకు సాధించేది ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి రాజకీయ నాయకుల, అధికారుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సైపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.