Arrangements | ధర్మారం, జనవరి 18: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శీతల చెరువు సమీప గుట్టల కింద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర కోసం జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు ఇక్కడ జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో ఉత్సవాలు కోసం జాతర ఉత్సవ కమిటీతో పాటు దాతలు విరాళాలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో జాతర ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు దాగేటి ఉదయ్, అధ్యక్షుడు నార ప్రేమ్ సాగర్, ఉపాధ్యక్షుడు కల్వల రవి, కోశాధికారి తుమ్మల తిరుపతి ఆధ్వర్యంలో జాతర ఉత్సవ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల భక్తులు సాఫీగా వెళ్లడానికి ఇదివరకు ఉన్న దారిని జేసీబీ, బ్లేడు ట్రాక్టర్ ద్వారా చెట్లు, చేమలు తొలగించి శుభ్రం చేయిస్తున్నారు.
జాతర ప్రదేశం వద్ద ఇదివరకే ఉన్న జంపన్న వాగు లో పూడిక తొలగింపజేసి నీటిని నింపి క్లోరినేషన్ చేయించి సిద్ధం చేస్తున్నారు. జాతర ఉత్సవ నిర్వాణ కోసం గ్రామంలోని అన్ని కుల సంఘాలకు సమాచారం ఇచ్చి విరాళాల సేకరణ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ తెలిపారు.