కరీంనగర్, డిసెంబర్ 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సహకార రంగ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం లిఖితం కాబోతున్నది. ఖాతాదారులకు ఉత్తమ సేవలందిస్తూ.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ జాతీయస్థాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్న కరీంనగర్ డీసీసీబీ రేపటితో శతవసంతాలు పూర్తిచేసుకోబోతున్నది. తన వందేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులకు లోనైనా ఎదురొడ్డి నిలిచి సహకార రంగానికే వన్నెతెచ్చింది. నాడు 100తో లావాదేవీలు ప్రారంభించి నేడు 4,600 కోట్ల టర్నోవర్‌కు చేరి దేశంలోనే శభాష్ అనిపించుకుంటున్నది. మధ్యలో 15 ఏండ్ల పాటు నష్టాల బాట పట్టి, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో చైర్మన్ కొండూరి ప్రణాళిక,కృషి, సీఈవో సత్యనారాయణ ప్రక్షాళన ఫలించి యావత్ దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఈ నెల 28న ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
దేశంలో సహకార రంగ వ్యవస్థ కుదేలవుతున్న నేటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థకే ఒక వన్నె తెచ్చిన ఘనత కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(కేడీసీసీబీ)కి దక్కుతుంది. తన వందేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి నేడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నది. ‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు’ అన్నట్లుగా ఇటు పాలవకర్గం.. అటు సిబ్బంది కలిసి బ్యాంకు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ యావత్ దేశానికి ఒక ఐకాన్‌గా నిలిపారు. ఈ వందేళ్ల ప్రస్థానంలో సాగిన ఒడిదొడుకులు.. కొండూరు వేసిన కొత్త బాటలు.. అందుతున్న సేవలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
100 నుంచి 4,600కోట్ల టర్నోవర్‌కు..
వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి పొందేందుకు ఏర్పడిన సహకార సంఘాల స్ఫూర్తిగా 19-10-1921న కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు పురుడు పోసుకుంది. 100 మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీలకు, వ్యవసాయేతర సహకార సంఘాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ బ్యాంకు ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఉమ్మడి జిల్లాలో అన్నదాతలకు రుణాలు ఇస్తూ అండగా నిలుస్తూ వచ్చింది. 1979-80 అడిట్ నివేదిక ప్రకారం అప్పట్లో ఉన్న ఉమ్మడి జిల్లాలోని 1207 గ్రామాల్లో 1167 గ్రామాల్లో మల్టీపర్పస్ సహకార సంఘాలు రైతాంగానికి సేవలందించడం గమనార్హం. 1921లో 100తో మొదలైన ఈ బ్యాంకు లావాదేవీలు 1956-57లో 8లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,600 కోట్ల లావాదేవీలకు చేరుకుంది. ఇందులో అన్నదాతలకు అత్యధిక రుణాలు అంటే 2,266 కోట్లు ఇస్తూ వారికి బాసటగా నిలుస్తోంది.
కొత్త బాట పట్టించిన కొండూరి
2005-06 నాటికి 57,92 కోట్ల నష్టాల్లో ఉన్న సమయంలో కొండూరు రవీందర్రావు బ్యాంకు బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు జరిగిన లోపాలను అధ్యయనం చేయడమే కాదు, ఖాతాదారులను, రుణ గ్రహీతలకు చైతన్యవంతం చేశారు. బ్యాంకు సిబ్బంది పనితీరులో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆరేళ్లలోనే అంటే 2012-13 నాటికి బ్యాంకు నష్టాలను పూడ్చుకొని నికర లాభాల బాట పట్టింది. ఇందులో భాగంగానే 128 సహకార సంఘాల్లో 127 సంఘాలు నికర లాభాలు ఆర్జిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో చేయాల్సిన మార్పులను ఎప్పటికప్పుడు కేడీసీసీ బ్యాంకులో అమలు చేయించడంలో కీలక భూమిక పోషించారు. నాబార్డు సహకారం తీసుకుంటూ.. బ్యాంకు ద్వారా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఖాతాదారులకు మేమున్నామన్న భరోసా కల్పించారు. కొండూరు పట్టించిన కొత్త బాట, వారి విజన్, కష్టానికి తగ్గ ఫలితాలే నేటి జాతీయ అవార్డులు. బ్యాంకుతోపాటుగా కొండూరు రవీందర్రావు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా, టెస్కాబ్ చైర్మన్‌గా ప్రస్తుతం జాతీయ సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దాకా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనం.
అవార్డుల పంట
బ్యాంకు అందిస్తున్న ఉత్తమ సేవలకు జాతీయస్థాయిలో అనేక ఉత్తమ అవార్డులను అందుకుంది. 2015-16లో జాతీయ మూడో స్థానాన్ని అవార్డు రూపంలో అందుకుంది. 2017-18లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం, 2018-19లో జాతీయస్థాయిలో మొదటి స్థానాన్ని అందుకుంది. 2013-14 నుంచి 2016-17 వరకు మహిళా సంఘాలకు అందించే రుణాలతో నాబార్డు అవార్డును సొంతం చేసుకుంది. సంచార ఏటీఎంలను గ్రామాల్లో తిప్పడం, అత్యధికంగా రైతులకు రూపే కార్డులను అందించే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2018-19 లోదేశ వ్యాప్తంగా 362 డీసీసీబీ బ్యాంకులను దాటుకొని అన్ని రకాల సేవల్లో కరీంనగర్ డీసీసీబీ ఉత్తమ బ్యాంకుగా గుర్తింపు పొంది ముంబైలో నాఫ్స్క్బ్ ద్వారా అవార్డును అందుకుంది.
అదేబాటలో సీఈవో..
ఏ సంస్థ అయినా అభివృద్ధి పథంలో నడవాలంటే పాలకవర్గంతో పాటు అధికారయంత్రాగం కలిసి పనిచేయాలి. ఈ విషయంలో కేడీసీసీ బ్యాంకు ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఎన్. సత్యనారాయణరావు.. కొండూరి బాటలో నడిచారు. 1986లో స్టాఫ్ అసిస్టెంట్‌గా నియమితులైన సత్యనారాయణరావు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. బ్యాంకింగ్ రంగంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి దాకా మంచి పట్టు సాధించారు. ఖాతాదారులకు అనువైన సేవలందించేందుకు అవసరమైన కంప్యూటరీకరణ, సేవల విస్తరణ, బ్యాంకుల ఆధునీకరణ వంటి విషయాల్లో కొండూరుతో కలిసి ముందుకు సాగారు. దీంతో కేడీసీసీ బ్యాంకు మంచి లాభాలను ఆర్జించడమే కాదు, జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నది.
నష్టాల నావ..
1990 వరకు లాభాల బాటలో నడిచిన జిల్లా బ్యాంకు ఆ తర్వాత అంటే 2005 వరకు నష్టాల బాటలో నడిచింది. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన అనేక మార్పులు, పాలకవర్గాలకు దిశానిర్దేశం లేకపోవడం, అధికారుల నిర్వహణ లోపం, జిల్లా రుణాల చెల్లింపులకు కావాల్సిన పరిస్థితులు అన్నదాతలకు సహకరించకపోవడం, కొత్త చట్టాలు అమల్లోకి రావడం వంటి అనేక కారణాల వల్ల 2005 నాటికి 57 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. కొన్నేళ్లపాటు బ్యాంకు ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
ఉత్సవాలు
శతాబ్ధి ఉత్సవాల వేడుకలకు కేడీసీసీబీ ముస్తాబైంది. ఈ నెల 28న కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ర్టాల సహకార బ్యాంకుల చైర్మన్లు పాల్గొననున్నారు. వందేళ్ల ప్రగతికి చిహ్నంగా బ్యాంకులో పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లు ఉత్సవాల్లో పాల్గొంటారు.