కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో అవినీతి బాగోతం వెలుగులోకి వస్తున్నది. గత కమిషనర్ తొలగించిన కార్మికుల పేరుతో ఇటీవల జీతాలు డ్రా చేసినట్టు తెలుస్తున్నది. వీరికి బయోమెట్రిక్ హాజరు లేకుండా వేతనాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అటు ఉన్నతాధికారులు, ఇటు పాలకవర్గం కూడా దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, మే 16 : కరీంనగర్ నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న బదిలీ కార్మికుల విషయంలో గత కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సమయంలో 65 మంది పని చేస్తున్నట్టు గుర్తించారు. ఆ మేరకు కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులు, తమ సమీప బంధువులు ఎవరు పని చేస్తున్నారో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అనంతరం ఆయా కార్మికుల పేర్లను తొలగించి, బదిలీగా పని చేస్తున్న వారి పేర్లను చేర్చి పనులు కొనసాగించారు.
ఈ పక్రియలో 8 నుంచి 10 మంది విధులు నిర్వహించే స్థితిలో లేకపోవడం.. వారికి బదులుగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ రాకపోవడంతో వారిని విధుల నుంచి తప్పించారు. కాగా, అప్పటి నుంచి వారికి వేతనాలు అందించడం లేదు. కాగా, ఇటీవల కొత్తగా పారిశుధ్య అధికారులు ఆ పేర్లపై జీతాలను డ్రా చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకొని, దాని ద్వారానే జీతాలు చెల్లిస్తారు. కానీ, తొలగించిన కార్మికుల జీతాలను మాత్రం మాన్యువల్‌గానే హాజరు పరిగణలోకి తీసుకొని డ్రా చేసినట్టు సమాచారం.
గతంలో కార్మికులను తొలగిస్తే.. ఇప్పుడు వారి పేరిట జీతాలు ఎలా డ్రా చేశారన్న విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి స్థానాల్లో ఎవరినైనా తీసుకొని జీతాలు ఇస్తున్నారా..?, లేక తప్పుగానే నమోదు చేసి నొక్కేస్తున్నారా..? అన్న చర్చ బల్దియాలో సాగుతున్నది. ఈ వ్యవహారంలో భారీగానే ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పారిశుధ్య విభాగంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా అటు ఉన్నతాధికారులు గానీ, ఇటు పాలకవర్గ సభ్యులు గానీ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ అధికారులు తమ ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు కార్పొరేటర్లే విమర్శిస్తున్నారు. వీరిపై ఇప్పటికే ఫిర్యాదులు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయినా, ఎక్కడా కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని వాపోతున్నారు. జిల్లా యంత్రాగం దృష్టి సారించి చర్యలు చేపడితే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.