కార్పొరేషన్, జూన్ 11: కరీం‘నగరం’లో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. డివిజన్ల సరిహద్దుల మ్యాపింగ్‌కు, ముసాయిదాలో ప్రకటించిన ఇంటి నంబర్ల జాబితాకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. కొన్ని డివిజన్లల్లో మ్యాపింగ్‌లో చూపించిన ప్రాంతంలో మూడు సిరీస్‌లకు చెందిన ఇంటి నంబర్లు ఉన్నప్పటికీ, అధికారులు కేవలం రెండు సిరీస్‌లను మాత్రమే చూపించారు.
ఫలితంగా డివిజన్ల వారీగా అధికారులు చూపించిన ఓటరు సంఖ్యకు, వాస్తవ ఓటరు జాబితా లెక్కలకు ఎక్కడా సరిపోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని డివిజన్లల్లో ఒకే ఇంటి నంబర్‌పై అనేక బై నంబర్స్‌తో ఇండ్లు ఉండడంతో పెద్ద సంఖ్యలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తున్నది. నగరపాలక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే కేవలం కాగితాల్లోనే మ్యాపింగ్, ఇంటి నంబర్లను పేర్కొంటూ ఓటర్ల సంఖ్యను వేశారనే విమర్శలు ఉన్నాయి.
కుదరని ఓట్ల సంఖ్య
ముసాయిదాలో ప్రతి డివిజన్లో సుమారు 5 వేల ఓటర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ, ఈసీ 2025 జనవరిలో ఇచ్చిన జాబితాలో ఇంటి నంబర్ల ప్రకారం చూస్తే అధికారుల లెక్కలకు పొంతన కుదరడం లేదు. అన్ని డివిజన్లలో ఓటర్ల లెక్కలో తేడాలు కనిపిస్తున్నాయి. 4వ డివిజన్లో 5012 ఓటర్లు ఉన్నట్టు అధికారులు చూపించారు. అక్కడ ఇంటి నంబర్ల ప్రకారం చూస్తే 7,282 ఓటర్ల లెక్క వస్తున్నట్టు తెలిసింది. 5వ డివిజన్లో 5052 ఓటర్లు ఉన్నట్టు చూపినా, ఇంటి నంబర్ల ప్రకారం చూస్తే అక్కడ 2875 మంది ఓటర్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది.
ఇక 10వ డివిజన్లో 5052 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించగా, అక్కడా 6021 ఓటర్లు, 11వ డివిజన్లో 5008కు గాను 4793 ఓటర్లు, 18వ డివిజన్లో 5032 ఓటర్లను పేర్కొంటే అందులో 2877 ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇలా అత్యధిక డివిజన్లల్లో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉండడంతో అన్ని పార్టీల నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అయితే ముసాయిదా జాబితాపై మంగళవారం వరకు 234 అభ్యంతరాలు రాగా, అధికారులు పరిశీలిస్తూ, ఆ మేరకు సర్దుబాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తున్నది.
ఓటర్ల సంఖ్యలో తేడాలున్నాయి
డివిజన్ల వారీగా అధికారులు చూపించిన ఓటర్ల సంఖ్యకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ల సంఖ్యకు ఎక్కడా పొంతనలేదు. చాలా తేడాలున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే కార్యాలయంలో కూర్చొని ఇష్టారాజ్యంగా పునర్విభజన చేసినట్టు ఉన్నది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి డివిజన్లను విభజించాలి.
– చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు