Ramagundam | కోల్ సిటీ, జూన్ 6 : రామగుండం బల్దియాలో అవకతవకలపై అధికారులు, కాంట్రాక్టర్లలో విచారణ గుబులు మొదలైంది. టీయూఎస్ఐడీసీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఫిర్యాదు మేరకు శనివారం విచారణ అధికారి, రీజనల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ విచారణ చేపట్టారు. ఆ పనులకు సంబంధించిన రికార్డులతో విచారణకు హాజరు కావాలని ముందుగానే నగర పాలక సంస్థకు నోటీసులు పంపించిన క్రమంలో శనివారం విచారణకు హాజరైన అధికారులు సరియైన రికార్డులు సమర్పించలేదు. దీంతో 15 వరకు విచారణ వాయిదా చేశారు. కాగా 2024 జూలై నుంచి టీయూఎఫ్డీసీ, ఇతర అభివృద్ధి పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అత్యవసర పనుల టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా వాట్సాప్ గ్రూప్ తయారు చేసి కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగించారంటూ మాజీ కార్పొరేటర్ విజిలెన్స్ కమిషనర్, కలెక్టర్, సీడీఎంఏకు గత నవంబర్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టీయూఎఫ్ ఐ డీ సీ నిధులతో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, భూగర్భ డ్రైనేజీ, రామగుండం ప్రధాన నాలా ఇందిరానగర్ నుంచి ఎన్టీపీపీ వరకు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి కాంట్రాక్టర్లు, అధికారులు అవినీతికి పాల్పడ్డారనీ, పెట్రోలు, డీజిల్ బిల్లు గతంలో రూ.10లక్షలు ఉంటే ఇప్పుడు 20 లక్షలకు చేరిందనీ, అలాగే అధికారులు ప్రైవేటు బిల్డర్లతో మమేకమై డాక్యుమెంట్లు లేకుండానే ఇంటి నంబర్లు కేటాయించడంలో లక్షలు చేతులు మారాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా వర్క్ ఇన్స్పెక్టర్లతో బిల్లులు రాయించి అవినీతికి పాల్పడినట్లు పేర్కొన్నారు. రంజాన్, బక్రీద్, దసరా, దీపావళికి సంబంధించిన పనులు, బ్లీచింగ్, సున్నం, వాహనాల మెయింటనెన్స్లో భారీగా అక్రమాలు జరిగాయనీ, టీయూఎఫ్డీసీ నిధుల నుంచి డీపీఆర్ తయారైన చోట కాకుండా సీసీ రోడ్లు ఉన్న చోటనే కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టి నిధుల దుర్వినియోగంకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. గడిచిన 18 నెలలుగా జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.
సీడీఎంఏ ఆదేశాల మేరకు శనివారం వరంగల్లో ఆర్ డీ మున్సిపల్ అధికారులను విచారించారు. సరియైన రికార్డులు చూపించని కారణంగా 15 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత డీఎంఏకు నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు ఉంటాయని విచారణ అధికారి తెలిపారు. ఐతే వరంగల్ లో గాకుండా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలోనే విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారురాలు సుమలత కోరారు.