కొత్తపల్లి, అక్టోబర్ 20: సహకార సంఘాలు నిజాయితీ, నిబద్ధతతో పని చేయాలని, సహకారంతో ఏదైనా సాధించవచ్చని కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. చింతకుంట సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చింతకుంట గ్రామంలో సహకార భారతి తెలంగాణ శాఖ 4వ రాష్ట్రస్థాయి మహా సభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. దేశంలో సహకార సంఘాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, సహకార భారతి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షుడు న్యాలమడుగు శంకరయ్య మాట్లాడుతూ, సహకార సంఘాలు దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. జాతీయ కార్యదర్శి నందినిరాయ్ మాట్లాడుతూ, మహిళాభివృద్ధికి దేశవ్యాప్తంగా సహకార భారతి పని చేస్తున్నదన్నారు. ప్రధాన వక్త ఆయాచితుల లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కార్యకర్త జవాబుదారీగా పని చేయాలన్నారు. ఈ రాష్ట్ర మహాసభలో అన్ని జిల్లాల నుంచి రైతులు, సహకార సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మహా సభలో రాష్ట్ర నాయకులు కుమారస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, జిల్లా అధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఆంజనేయులు, గారు లింగారెడ్డి, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.