హౌసింగ్‌బోర్డుకాలనీ, డిసెంబర్ 14: పాఠశాలల్లో విద్యార్థులను దండిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆడిటోరియంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో శారీరక దండన నిర్మూలనపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు వ్యక్తిగత సమస్యలను పిల్లలపై చూపవద్దన్నారు. తోటి విద్యార్థుల ముందు ఒకే విద్యార్థిని కించపరిచినట్లుగా మాట్లాడవద్దని, అలాంటి సందర్భంలో విద్యార్థి మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలు మారేందుకు కౌన్సెలింగ్ చేయాలి తప్ప దండించవద్దన్నారు.
అమ్మానాన్నల కంటే పిల్లలు గురువు మాటనే ఎకువగా వింటారని, ఉపాధ్యాయుడు తప్ప పిల్లల ఆలోచన విధానాన్ని ఎవరూ మార్చలేరని తెలిపారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో, వసతి గృహాల్లో శారీరక దండన నిర్మూలన కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన జైనబ్ అనే దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ మాట్లాడుతూ, పిల్లలు తమ సమస్యలను ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రతి పాఠశాలలో డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి పాఠశాలలో మానిటరింగ్ కమిటీ తప్పనిసరిగా ఉండాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈ కమిటీలో సభ్యుడిగా ఒక లాయర్‌ను కూడా తాము నియమిస్తామని తెలిపారు. అడ్వకేట్ కూకట్ల కొమురయ్య మాట్లాడుతూ, బాలల సంరక్షణ చట్టాలు, హకుల గురించి వివరించారు. సైకాలజిస్టులు శ్రీనివాస్, డాక్టర్ వర్షి మాట్లాడుతూ, బాలల మానసిక సమస్యలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా వైద్యాధికారి జువేరియా, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, డీసీపీవో శాంత, సీడీపీవో ఉమారాణి, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయాలి
జిల్లాలో అర్హులందరితో ఓటరుగా నమోదు చేయించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఆయన ఓటరు, ధరణి, ల్యాండ్ అక్విడిజేషన్పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయాలన్నారు.
ఈనెల 15వ తేదీలోగా కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన ఫాం-6 దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలని ఈఆర్వో, ఏఈఆర్వోలను ఆదేశించారు. ఫాం -7, ఫాం -8ను నిశితంగా పరిశీలించాలని, పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ధరణి, ల్యాండ్ అక్విడిజేషన్ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్ కుమార్, హరిసింగ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.