Tax collection | కోల్ సిటీ, మే 8 : రామగుండం నగరపాలక సంస్థకు మరో గుర్తింపు లభించింది. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు దీటుగా మొదటి స్థానం దైవసం చేసుకుంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణ శ్రీ ప్రత్యేక చొరవతో ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ ఆఫర్ ఫలించింది. అధికారుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆస్తిపన్ను చెల్లించిన వారికి పన్ను మొత్తంలో ఐదు శాతం రాయితీ ప్రకటిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ గడువు మొదట ఏప్రిల్ 30 తో ముగిసిపోయినప్పటికీ ప్రజల అభ్యర్థన మేరకు మే 7 వరకు ప్రభుత్వం పొడిగించింది. గడువు ముగిసిపోయే సమయానికి రామగుండం నగర పాలక సంస్థ 47.91 శాతం పన్ను వసూలు సాధించి ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే ప్రధమ స్థానంలో , రాష్ట్రంలోని 151 పట్టణ స్థానిక సంస్థలలో నాలుగవ స్థానంలో నిలిచింది.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో 51,033 ఆస్తి పన్ను అస్సెస్స్మెంట్లు ఉండగా మొత్తం పన్ను డిమాండ్ రూ 19 . 14 కోట్లు ఉంది. ఇందులో 13, 915 పన్ను అస్సెస్స్మెంట్ల నుండి రూ 9.7 కోట్లు వసూలయింది. రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , కమిషనర్ గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) అరుణ శ్రీ ఎప్పటికప్పుడు పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షిస్తూ సిబ్బందికి మార్గ నిర్దేశం చేయడంతో స్వల్ప వ్యవధిలోనే రామగుండం నగర పాలక సంస్థ ఈ ఘనత సాధించింది.
పన్ను వసూళ్లలో రామగుండం నగర పాలక సంస్థ ముందంజలో ఉండడానికి కృషి చేసిన డిప్యూటీ కమిషనర్ వెంకట స్వామి , ఆర్ఓ ఆంజనేయులు, ఆర్ఐ లు శంకర్ రావు , ఖాజా , వార్డు అధికారులు , బిల్ కలెక్టర్లను రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి తోపాటు కమిషనర్ అభినందించారు.