కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో మరో అవినీతి పర్వం వెలుగు చూసింది. ఎయిడెడ్ టీచర్ల వేతన స్థిరీకరణలో అక్రమాలకు తెరలేపిన విషయం బయటకు రావడంతో అధికారులు వెనక్కి తగ్గడం మరువక ముందే.. ఇటీవల సర్దుబాటులో అవకతవకల బాగోతం కలకలం రేపింది. సర్దుబాటుపై కథనాలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టగా.. తాజాగా పదోతరగతి మూల్యాంకన పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకొని, కొంతమంది అధికారులు గుట్టుచప్పుడు కాకుండా లక్షలు సొమ్ము చేసుకోవడం బయటకు పొక్కింది. దీనిపై రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (డీజీఈ) అధికారులు నోటీస్ జారీ చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది.
అయితే ముందుగానే అప్రమత్తమైన అక్రమార్కులు.. అందుకు సంబంధించిన స్క్రాప్ ఫైల్‌ను మాయం చేసి, ఈ తప్పు నుంచి గట్టేందుకు పదో తరగతి మోటివేషన్ సమావేశాల కోసం ఖర్చు పెట్టామంటూ ఏకంగా కలెక్టర్‌నే పక్కదారి పట్టించేలా నోటు ప్రిపేర్ చేశారు. అక్కడితో ఆగకుండా విద్యాశాఖలో పనిచేసే ఓ కీలక అధికారి, మరో ఓ కోఆర్డినేటర్ కలిసి, తమ తప్పులు బయటపడకుండా ఉండేందుకు వేర్వేరు ఖాతాల నుంచి నిధులను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం ప్రస్తుతం విద్యాశాఖలో హాట్‌టాపిక్‌లా మారింది.
కరీంనగర్, అక్టోబర్ 14 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : పదోతరగతి మూల్యాంకనం (సమాధానాలు రాసిన పత్రాలు) చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు దాచిపెట్టాలి. ఆ తదుపరి జిల్లా విద్యాశాఖలోని పరీక్షల విభాగం సదరు సమాధాన పత్రాలను వేలం వేసి, విక్రయించాలి. అందుకు కొన్ని నిబంధనలున్నాయి. ముందుగా సదరు పేపర్‌ను వేలం వేస్తున్నట్టు ఒక ప్రకటన జారీచేయాలి. ఆ మేరకు చిన్నతరహా పరిశ్రమల నుంచి కొటేషన్లు తీసుకోవాలి. సదరు కొటేషన్లలో నిబంధనలకు లోబడి ఉన్న పరిశ్రమను గుర్తించి, ఆ మేరకు కమిటీ ఆమోదం తీసుకొని విక్రయించాలి. అమ్మగా వచ్చిన ప్రతి పైసను డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అకౌంట్లో జమచేయాలి. అందుకు సంబంధించిన వివరాలను తిరిగి సదరు అధికారులకు సమర్పించాలి.
అంతేకాదు, విక్రయాలకు సంబంధించిన స్క్రాప్ ఫైలును మెయింటెన్ చేయాలి. సదరు ఫైలులో ఎంత మొత్తం విక్రయించారు? అది ఏ సంవత్సరానికి సంబంధించింది? అమ్మగా వచ్చిన సొమ్ము ఎంత? ధ్రువీకరించిన అధికారులెవరు? సదరు అమౌంట్‌ను ప్రభుత్వ ఖాతాలో ఎప్పుడు జమచేశారు? అన్న వివరాలను నమోదు చేయాలి. ఏవైనా ఆరోపణలు వచ్చినా.. లేదా ఆడిట్ సమయంలోనైనా సరే సదరు ఫైలును చూపించాల్సి ఉంటుంది. కానీ, విద్యాశాఖలో కొంతమంది అధికారులు ఈ నిబంధనలను విస్మరించారు. 2022-23కు సంబంధించిన సమాధాన పత్రాలను మొత్తం విక్రయించారు. కానీ, అందుకు సంబంధించిన సొమ్ము ఏ ఖాతాలోనూ జమచేయలేదు. గుట్టుచప్పుడు కాకుండా పనిచేసిన అధికారులు.. సదరు మొత్తాన్ని జేబులో వేసుకున్నట్టు తెలిసింది. ఇక తమకు ఎదురు లేదని భావించినా.. పంపకాల్లో కొంత తేడా వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.
2022-23కు సంబంధించి విక్రయించిన సమాధాన పత్రాల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ విషయంపై గత నెల 24న జిల్లా విద్యాధికారికి డీజీఈ అధికారులు ఒక నోటీస్ జారీ చేశారు. విక్రయించిన డబ్బులను తమ ఖాతాలో ఎందుకు జమచేయలేదో చెప్పాలని కోరారు. అలాగే ఈ విక్రయానికి సంబంధించి మీరు ఇచ్చిన ప్రకటన ఏంటి? ఎన్ని చిన్నతరహా పరిశ్రమలు పాల్గొన్నాయి? వారు ఇచ్చిన కొటేషన్లు ఏంటి? ఏ కంపెనీ ఎంత కోట్ చేసింది? ఏ తేదీన విక్రయించారు? ఎవరి సమక్షంలో అమ్మారు? ఇన్నాళ్లుగా సదరు సొమ్మును తమ ఖాతాలో జమ చేయకపోవడానికి కారణాలు ఏంటి? అని సదరు నోటీస్‌లో ప్రశ్నించారు. దీంతో ఈ వివరాలను ఇవ్వాలంటూ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి సంబంధిత సెక్షన్ అధికారులకు పంపించారు.
దీంతో ముచ్చెమటలు పట్టిన సదరు అధికారులు, అందులో నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకోసం ఏకంగా కలెక్టర్‌నే పక్కదారి పట్టించేలా ఒక నోట్కూడా ప్రిపేర్ చేసినట్టు తెలుస్తున్నది. 2024లో పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు నిర్వహించిన సమావేశాల కోసం లక్షా ముప్పైవేల రూపాయలు ఖర్చు చేశామని, వాటిని ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌కు ఓ నోట్ ప్రిపేర్చేసి పంపినట్టు తెలుస్తున్నది. ప్రశ్నపత్రాలు అమ్మగా వచ్చిన డబ్బులనే అందుకు ఖర్చు చేశామని చెప్పుకునే ప్రయత్నం సదరు అధికారులు చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా విధ్యాశాఖలో పనిచేసే ఓ కీలక అధికారి, అలాగే ఓ కో-ఆర్డినేటర్ కలిసి బాగోతం నడుపుతున్నట్టు తెలుస్తున్నది. కలెక్టర్ నుంచి 1.30 లక్షలు వస్తే, ఆ డబ్బులను తిరిగి డీజీఈ ఖాతాలో జమ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
మరోవైపు ప్రస్తుత ఇన్చార్జి డీఈవోను మభ్యపెట్టి, అమ్మ ఆదర్శ పాఠశాలల నిధుల అకౌంట్లో జమవుతున్న వడ్డీ నుంచి డబ్బులు మళ్లించి, కలెక్టర్ ఆమోదంతో చలానా చెల్లించడానికి మరో నోట్‌ఫైలు సిద్ధం చేసినట్టు తెలిసింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుత పరీక్షల విభాగంలో పనిచేస్తున్న అధికారులపై సైతం ఒత్తిడి పెంచి, ఆ విభాగంలోని అకౌంట్ నుంచి డబ్బులను మళ్లించేందుకు సదరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే జిల్లా ఇన్చార్జి విద్యాధికారి మాత్రం డీఈవో పరీక్షల విభాగం బ్యాంకు అకౌంట్, స్టేట్మెంట్లు, స్క్రాప్ ఫైలు, అమ్మకం ఫైలు, అందుకు సంబంధించిన ఖర్చుల వివరాలు సమర్పించాలని అధికారులను కోరినట్టు తెలుస్తున్నది. మరోవైపు రాష్ట్ర అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుండగా.. అక్కడి నుంచి అంటే రాష్ట్ర అధికారులను కూడా మచ్చిక చేసుకొని, విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సదరు అక్రమార్కులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు విద్యాశాఖలో చర్చ జరుగుతున్నది.
అలాగే స్క్రాప్ ఫైలును పూర్తిగా మాయం చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ పరిస్థితుల్లో దీనిపై లోతైన విచారణ చేయిస్తే అక్రమార్కుల గుట్టు బయటపడడంతోపాటు సదరు అధికారుల అవినీతి బాగోతం మరింత బహిర్గతం అయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు విద్యాశాఖలో వ్యక్తమవుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం చూస్తే.. సమాధాన పత్రాలు అమ్మగా వచ్చిన డబ్బులను విద్యాశాఖాధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. కచ్చితంగా డీజీఈ అకౌంట్లో జమచేయాలి. ఒకవేళ ఏదైనా అవసరముంటే తిరిగి సదరు రాష్ట్ర అధికారులకు నోట్ పెట్టి, డబ్బులు మంజూరు చేయించుకొని వాడుకోవాలి. కానీ, ఇక్కడ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన దానిపై మున్ముందు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.