YellaReddypeta| ఎల్లారెడ్డిపేట, నవంబర్ 3: ఐదు రోజులుగా మండలంలోని ఓ రైస్‌మిల్లులో ధాన్యం దింపుకోకపోవడంతో చిరెత్తుకొచ్చిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వరిధాన్యం లోడుతో ఉన్న లారీని తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై ఉంచి సోమవారం నిరసనకు దిగారు. వెంకటాపూర్‌కు చెందిన రైతులు ఇది వరకే అధికారులకు తమ ధాన్యాన్ని కేటాయించిన గొల్లపల్లికి చెందిన రాజరాజేశ్వర రైస్‌మిల్లు యజమానులు మ్యాచర్ రావడం లేదంటూ దింపుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో వెంకటాపూర్ రైతులు ఐదు రోజులు వేచి చూసి మిల్లర్లు, అధికారులతో తాడే పేడో తేల్చుకుంటామని వెళ్లారు.
అయినప్పటికీ మిల్లర్లు మ్యాచర్ 22 వస్తుందని తిప్పి పంపించి వేశారు. దీంతో సదరు లారీని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉంచి సుమారు గంట సేపు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న డీఎస్వో చంద్రప్రకాశ్ రైతులకు నచ్చజెప్పి ధాన్యం దింపుకోని మిల్లు నిర్వాహకులకు నోటీసులు పంపిస్తున్నామని తప్పకుంటా సదరు మిల్లుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వరిధాన్యం లోడు ఉన్న లారీని దాని పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌కు తరలించి ధాన్యం మ్యాచర్ను పరిశీలించగా 18 శాతంగా ఉండగా మిల్లు యజమానులకు నచ్చజెప్పి దింపుకునేందుకు ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎస్వో చంద్రప్రకాశ్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా ధాన్యం దింపుకోకుండా అధికారుల ఆదేశాలను సైతం లెక్కజేయని రాజరాజేశ్వర ఇండస్ట్రీస్‌కు నోటీసులు పంపిస్తున్నామని ఒక్క క్వింటాల్ ధాన్యం కూడా సదరు మిల్లుకు పంపవద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.