కలెక్టరేట్, ఏప్రిల్ 12 : ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న ఉద్యోగోన్నతుల్లో అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరుపాలని, అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సమ్మయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ఆసంఘం జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా టీచర్లు, ఆయాల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారిని పక్కన బెట్టి, అనర్హులకు ఆయాల నుంచి టీచర్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తున్నారని మండిపడ్డారు.
మెడికల్ టెస్టుల పేర అనేక మంది ఆయాలను ఇబ్బందులకు గురిచేస్తూ, వారిని విధులు నిర్వహించకుండా అధికారులు కట్టడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ తతంగం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఆ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని వాస్తవాలు సేకరిస్తే ఆశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. అర్హులైన ఆయాలకు టీచర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలు మండలాల నుంచి వచ్చిన అంగన్వాడీ కేంద్రాల ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.