Anganwadi | కరీంనగర్ కలెక్టరేట్, జూలై 9 : నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారికి పౌష్టికాహారం అందిస్తూ, పూర్వప్రాథమిక విద్యనందించటమే లక్ష్యంగా కొనసాగుతున్న జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యల సాలె గూటిలో చిక్కుకుంటున్నాయి.
అధికారపార్టీ ఇచ్చిన హామీలు అటకెక్కగా ఆరు నెలలుగా అద్దె ఇళ్ళకు కిరాయిలు చెల్లించక, పెరుగుతున్న టీచర్లు, ఆయాల ఖాళీలలకు తోడు కొద్ది రోజులుగా ప్రభుత్వ భవనాల్లోకి మారుతున్న కేంద్రాలు వెరసి ఇటు విద్యార్థులు, అటు లబ్దిదారుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నది. ఫలితంగా ఆశించిన లక్ష్యం చేరుకోక అంగన్వాడీల సేవలు అందనంత దూరంగా వెళ్తున్నాయనే విమర్శలు వస్తున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రాల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్దమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దీంతో, పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాదిరాళ్ళుగా నిలుస్తున్న అంగన్వాడీ కేంద్రాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనున్నదా అనే అందోళన అందరిలో నెలకొన్నది. అంగన్వాడీల అభివృద్దే ధ్యేయమంటూ ఎన్నికలకు ముందు అధికార నేతలు ఇచ్చిన హామీలు అటకెక్కుతుండగా, కేంద్రాల్లో అందిస్తున్న సేవలు నామ్కే వాస్తేగా మారుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో 13 ప్రాజెక్టులు.. 3,134 అంగన్వాడీ కేంద్రాలు
ఉమ్మడి జిల్లాలో 13 ప్రాజెక్టులు కొనసాగుతుండగా, వీటి పరిధిలో 3,134 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 900కు పైగా కేంద్రాలు అద్దె భవనాలోనే కొనసాగుతున్నాయి. వీటికి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అద్దె బకాయిలు విడుదల చేయకపోవటంతో యజమానులు అద్దె చెల్లించాలంటూ చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక టీచర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిచోట్ల టీచర్లే చెల్లిస్తుండగా, మరికొన్నిచోట్ల స్వంతపూచీకత్తుపై కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అద్దె భారమవుతుందనే భావనతో అధికారులు కేంద్రాలను ప్రస్తుతమున్నచోటు నుంచి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఒత్తిడి తెస్తుండగా, సిబ్బంది మార్చుతున్నారు.
దీంతో, సుదూర ప్రాంతానికి మారిన కేంద్రాలకు వెళ్ళలేక లబ్దిదారులు అంగన్వాడీల సేవలందుకోలేక, చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు. మారిన కేంద్రాల్లో లబ్ధిదారులు, విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, అవి వెలవెలబోతున్నాయి. వాటిని పూర్వపు స్థితికి తేవాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తుండగా ఆయాలు, టీచర్లు నెత్తి నోరు బాదుకుంటున్నారు. దీనికితోడు పదవీ విరమణతో ఖాళీ అవుతున్న వారి స్థానంలో కొత్త నియామకాలు లేక, వాటి బాధ్యతలు కూడా ఉన్నవారికే అప్పగిస్తున్నారు. తమ విధులే నిర్వహించటం భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అదనంగా అప్పగిస్తున్న కేంద్రాల్లో విధుల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందనే ఆవేదన ఆయాలు, టీచర్ల నుంచి వ్యక్తమవుతున్నది.
1100కు పైగా పోస్టుల ఖాళీ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100కు పైగా టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా, ఈ భారం కూడా అధికారులు తమపైనే వేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. నూతన భవనాల నిర్మాణం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారటంతో ఉమ్మడి జిల్లాలో కేంద్రాల నిర్వహణ అధ్యాన్నంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి చాలాచోట్ల భవనాల నిర్మాణం పునాదులకే పరిమితం కాగా, ఆరోగ్య రక్షణ, పూర్వ ప్రాథమిక విద్యాబోధక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామంటూ పదే పదే చేస్తున్న ప్రకటనలు ఎండమావులుగా మారుతున్నాయని మండిపడుతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు రెండు శాతం కూడా భవనాల నిర్మాణం పూర్తికాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వం చెప్పేదోటి ఆచరణలో మరోటి చూపుతున్నదని స్పష్టమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణ చేసిన అంగన్వాడీ సిబ్బందికి అందించాల్సిన ప్రయోజనాలు కూడా సక్రమంగా అందించటం లేదనే అపవాదును ప్రభుత్వం మూటగట్టుకుంటున్నది.
ఏడాది కింద పదవీ విరమణ చేసినా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో సగం మందికి పైగా ప్రయోజనాలు అందలేదని, కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోతున్నట్లు పదవీ విరమణ చేసిన సిబ్బంది పేర్కొంటున్నారు సవాలక్ష సమస్యలు సిబ్బందిని వెంటాడుతుండగా చిన్నారులు, లబ్ధిదారులకు సకాలంలో సేవలందించటం గగనకుసుమమవుతున్నదనే భావన వ్యకమవుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది.
కేంద్రాల్లో అవసరమైన వసతుల కల్పనతో పాటు, టీచర్లు, ఆయాలు అందిస్తున్న సేవలను గుర్తించి పనికి తగిన వేతనం అందజేసింది. అలాగే, దశాబ్దాలుగా వేచి చూస్తున్న పదవీ విరమణ ప్రయోజనాలు కూడా కల్పించి ఆదుకోగా, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై బాహాటంగానే విమర్శలు సిబ్బంది నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.