కరీంనగర్‌కు ప్రధాన సమస్యగా మారిన డంప్‌యార్డు ఇప్పుడు అధికారులు, అక్రమార్కులకు కాసులు పండించే వ్యవస్థగా మారింది. లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఉన్న చెత్తను బయో మైనింగ్ చేయాలన్న పేరుతో ఏటా కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా.. సమస్య తీవ్రత మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఇటీవలే డంప్‌యార్డులో 29వేల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ చేయాలంటూ రూ.2 కోట్ల పనులు ఓ ఆంధ్రా సంస్థకు అప్పగించగా, ఈ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు తెలుస్తున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, మే 10: కరీంనగర్ డంప్‌యార్డులో బయో మైనింగ్ పనుల కోసం ఇటీవల ఆంధ్రాకు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు దక్కించుకున్నది. అయితే, ఈ సంస్థ పనితీరు బాగాలేదని ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంస్థను అక్కడి మున్సిపల్‌శాఖ టర్మినేషన్ చేసింది. అదే సంస్థకు ఇప్పుడు కరీంనగర్ డంప్‌యార్డులో బయో మైనింగ్ కోసం రూ.2కోట్ల పనులు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ సంస్థ డంప్‌యార్డులో 29వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేయాల్సి ఉన్నది. కానీ, అక్కడ ఏ మేరకు చెత్త బయో మైనింగ్ అవుతుందో తెలుసుకునేందుకు కనీసం వెయింగ్ మిషన్ కూడా లేకపోవడం విశేషం. కాగా, ఇప్పటికే ఈ సంస్థకు నగరపాలక అధికారులు రూ.75లక్షల మేరకు బిల్లులు చెల్లించినట్టు సమాచారం. ఈ విషయంలో సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, ఆ సంస్థ బయోమైనింగ్‌కు వినియోగిస్తున్న యంత్రం ఓ సంస్థ నుంచి లీజుకు తీసుకోగా, అందులోనూ వివాదాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్ని వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేశారో చెప్పకుండానే ఆ సంస్థకు భారీగా బిల్లులు చెల్లింపు విషయంలోనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
బయోమైనింగ్ పేరుతో నెల క్రితమే ఇంజినీరింగ్ అధికారులు రూ.2కోట్ల టెండర్లు పిలిచారు. కాగా, టెండర్ల పక్రియను పూర్తి చేసే విషయంలో అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు. టెండర్ల టెక్నికల్ బిడ్స్ తెరిచిన అధికారులు నిబంధనల మేరకు ఫైనాన్స్ బిట్స్ తెరిచి తక్కువ ధరకు టెండర్ వేసిన ఆయా సంస్థలకు పనులు అప్పగించే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చేస్తున్న సంస్థకే మరోసారి బయో మైనింగ్ పనులు అప్పగించేందుకే ఈ టెండర్లను ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్లల్లో ఐదు సంస్థలు పాల్గొన్నా.. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థకు ఈ టెండర్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఫైనాన్స్ బిట్స్ తెరవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డంప్‌యార్డు బయోమైనింగ్ కోసం చేపట్టిన టెండర్లల్లో తమ ముడుపులు, అనుకూల సంస్థలకు పనులు రావడం లేదనే ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు తెరుస్తలేరు. డంప్‌యార్డ్ నుంచి ఎగసిపడుతున్న మంటలు, పొగ, దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా డంప్‌యార్డు ప్రక్షాళన కోసం రూ.2కోట్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు టెండర్లు కూడా ఓపెన్ చేయలేదు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న వారికే మళ్లీ అవకాశాలు ఇచ్చేందుకే టెండర్లను కావాలనే పెండింగ్‌లో పెట్టారు. అధికారులు తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇవ్వాలనే కుట్ర జరుగుతున్నది. అర్హతలు లేనివారికి పనులు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– రవీందర్‌సింగ్, మాజీ మేయర్, కరీంనగర్ కార్పొరేటర్