Julapalli | జూలపల్లి, ఆగస్టు 30 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరును చూసి డప్పు చప్పుల నడుమ ఎడ్ల బండిపై ఊరేగించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాగభూషణం 2018 నుంచి జీవశాస్త్ర బోధకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
ఈ క్రమంలో ఎడ్ల బండిని రంగురంగుల తోరణాలు కొబ్బరి, అరటి ఆకులతో అందంగా అలంకరించారు. నాగభూషణంను ఎడ్ల బండిలో కూర్చోబెట్టారు. కొంతమంది విద్యార్థులు పూలు చల్లుతూ, మరి కొంతమంది ఎడ్ల బండిని ఉత్సాహంగా లాగుతూ ఊరేగించారు. దారి పొడువునా విద్యార్థులు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. ఎడ్ల బండిపై పాఠశాల నుంచి గోల్డెన్ ఫంక్షన్ హాల్ వరకు తీసుకెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడికి పూల మాలలు వేసి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జూలపల్లి ధర్మారం, ఎలిగేడు ఎంఈవోలు సరస్వతి, ప్రభాకర్ నరేంద్ర చారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.