వేములవాడ, సెప్టెంబర్ 16 : ముందుగా పక్కా స్కెచ్ వేసి.. హత్య చేసి.. కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడు దుబాయికి పారిపోయాడు. దీంతో పోలీసులు అతడిని దుబాయి నుంచి రప్పించేందుకు చర్యలు తీసుకుంటుండగా, ఏ2 నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన చందుర్తి మండలం మల్యాలలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి వెల్లడించారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన కొండూరి మల్లేశం తన భార్యతో నరేశ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం వచ్చి అతను ఇటీవల దుబాయి నుంచి వచ్చాడు.
ప్రైవేటు ఏరియాలో ఉంటూ ఈ నెల 14న పథకం ప్రకారం అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మల్లేశం తన ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన భార్యతో కలిసి ఉన్న నరేశ్‌ను హత్యచేసి దుబాయి పారిపోయాడు. ఈ ఘటనలో మల్లేశానికి సహకరించిన లక్ష్మణ్‌ను మూడపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.
నేరం చేసి దొరకకుండా ఉంటామని అనుకోవడం అవివేకమన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని, ఎంత దూరంలో ఉన్న నేరస్థుడిని పట్టుకొని కోర్టుకు అప్పజెబుతామన్నారు. ఇప్పటికే దుబాయిలో ఉన్న మల్లేశంను ఇండియాకు రప్పించేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ చర్యలు చేపట్టారన్నారు. సమస్యలుంటే కౌన్సెలింగ్, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలా హత్యలకు పాల్పడితే కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. హత్యలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. అనంతరం లక్ష్మణ్‌ను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.