ప్రాణాలను పణంగా పెట్టి, నల్లబంగారాన్ని వెలికి తీసే సింగరేణి కార్మికుల ఆరోగ్యానికి భరోసా కరువవుతున్నది. పని ప్రదేశాల్లో అంబులెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, సకాలంలో వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతున్నది. వాహనాలను సమీపంలోనే ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నా, అవి వచ్చే సరికి అరగంట నుంచి గంట సమయం పడుతున్నదని, ఈలోగా ప్రాణాలు గాలిలో కలిసే ముప్పు ఉంటుందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. భూగర్భ గనులు, ఓసీపీలు వద్ద అందుబాటులో ఉంచితే.. సకాలంలో వైద్య సేవలందే అవకాశముంటుందని చెబుతున్నారు. సంస్థకు వేల కోట్ల లాభాలు వస్తున్నా.. కనీసం పనిప్రదేశాల్లో అంబులెన్స్‌లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని మండిపడుతున్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలో 22 భూగర్భ గనులు, 19 ఓసీపీలు ఉన్నాయి. మొత్తం 41 వేల మంది పర్మినెంట్ కార్మికులు, 30 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అయితే కార్మికులు నిత్యం ప్రమాదాల మధ్య పనిచేస్తున్నా సంస్థ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మొత్తం 7 ఏరియా దవాఖానలు, 22 డిస్పెన్సరీలతో వైద్య సేవలందిస్తున్నా.. అంబులెన్స్‌ల విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తున్నది.
పని స్థలాల్లో అందుబాటులో ఉంచకపోవడంపై కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 71 వేల మంది కార్మికులతోపాటు ఏరియా కాలనీల్లోని ప్రజల కోసమని సంస్థ మొత్తంగా 67 అంబులెన్స్‌లను మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే అందులో సగానికిపైగా వాహనాలు రిపేర్లతో అక్కరకు రాకుండా పోయినట్టు తెలుస్తున్నది. వాటి స్థానంలో కొత్తవి తేవడం, అవసరమైనన్నీ ఏర్పాటు చేయడంలో సంస్థ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదనే విమర్శలున్నాయి.
రామగుండం రీజియన్ పరిధిలో చూస్తే.. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 పరిధిలో ఓసీపీ-3, 7 ఎల్పీ, ఓసీపీ-5, వకీల్‌పల్లి, ఓసీపీ-1, ఓసీపీ-2 ఎఫ్ 2, అడ్య్రాల లాంగ్వాల్ (ఏఎల్పీ), 10ఏ, 11ఇైంక్లెన్లు, 8 వరకు కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ (సీఎస్పీ)లు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్క 11 ఇైంక్లెన్ మినహా ఎక్కడా ఒక్కటంటే ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పని స్థలానికి అంబులెన్స్ వచ్చేందుకు కనీసం అరగంట నుంచి గంట పట్టే అవకాశం ఉంటున్నది.
ఈలోగా క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదముండగా, కార్మిక సంఘాలు నాయకులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్న సింగరేణి యాజమాన్యం తమ ప్రాణాలను పట్టించుకోవాలని, ప్రతి భూగర్భ, ఓసీపీ, సీహెచ్పీల వద్ద తప్పకుండా అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సంజీవని అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలి
బొగ్గు గనుల వద్ద అన్ని సౌకర్యాలతో కూడిన సంజీవని అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలి. మేం ప్రతి రోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బొగ్గు వెలికితీస్తున్నాం. ప్రమాదం జరిగితే.. సమయానికి వైద్యసహాయం అందక ప్రాణాలు పోతున్నాయి. ప్రతి మైన్ వద్ద సంజీవని అంబులెన్స్ ఉంటే కార్మికుల ప్రాణాలను కాపాడవచ్చు. ఈ విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
-సైండ్ల సత్యనారాయణ, ఈపీ ఆపరేటర్ ఓసీపీ-1 (రామగుండం-3)
మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తాం
సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉన్నా.. అక్కడ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తాం. అయితే, అవసరం మేరకు కొనుగోలు చేస్తున్నాం. ఇటీవలే కొత్తగా ఆరు కొనుగోలు చేశాం. భూగర్భ గనులు, ఓపెన్ కాస్టు గనుల వద్ద పెట్టాలనే ఆలోచన ఉంది. కానీ, ఇంకా సమయం పడుతుంది. ఉన్న అంబులెన్స్‌లను సమీపంలోనే ఉంచుతున్నాం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే చేరుకునే విధంగా అప్రమత్తంగానే ఉన్నాం. మరిన్ని అంబులెన్స్‌లను సైతం అందుబాటులోకి తీసుకువస్తాం.
-కిరణ్‌రాజ్‌కుమార్, సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (కొత్తగూడెం)