ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కొత్త పోలీస్ బాస్‌లు రాబోతున్నారు. కరీంనగర్, రామగుండం సీపీలుగా గౌష్ ఆలం, అంబర్ కిశోర్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా మహేశ్ బాబా సాహెబ్ గిటె నియమితులయ్యారు. పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ రానున్నారు.
కరీంనగర్, మార్చి 7(నమస్తే తెలంగాణ) : కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన అభిషేక్ మొహంతి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లిపోయారు. ఆయనను కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయిస్తూ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రిలీవ్ కావడానికి వీలు లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ క్యాడర్‌కు కేటాయించిన మరి కొందరు ఐపీఎస్ అధికారులను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన అనూహ్య బదిలీలో భాగంగా అభిషేక్ మొహంతి కరీంనగర్ సీపీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి తనదైన శైలిని కనబరుస్తూ విధులు నిర్వహించారు. భూకబ్జా కేసులు, ఆర్థిక నేరాలపై అభిషేక్ మొహంతి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన స్థానంలో 2017 ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన గౌష్ ఆలంను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన మంచి అధికారిగా గుర్తింపు పొందారు. నకిలీ పత్తి విత్తనాలు, గంజాయి, దేశీదారు మద్యం, మట్కాపై ఉక్కుపాదం మోపి కట్టడి చేశారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. నేరాల నియంత్రణలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తతం సీపీగా వస్తున్న ఆయన, త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
ఫర్టిలైజర్‌సిటీ, మార్చి 7 : రామగుండం పోలీస్ కమిషనర్‌గా అంబర్ కిశోర్ ఝా రానున్నారు. 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొంది రాచకొండ జా యింట్ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం వరంగల్ సీపీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రామగుండం సీపీగా పనిచేస్తున్న ఎం శ్రీనివాస్ సీఐడీ ఐజీగా బదిలీ అయ్యారు. 2024 ఫిబ్రవరి 12న జాయిన్ అయిన ఆయన, 13 నెలల పాటు పనిచేశారు. అలాగే, పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతనను మహిళా భద్రత విభాగం ఎస్పీగా బదిలీ చేయగా, ఆమె స్థానంలో వెయిటింగ్లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ కరుణాకర్‌ను నియమించారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 7(నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ములుగు జిల్లా ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్ బాబా సాహెబ్ గిటె నియామకమయ్యారు. బదిలీపై వెళ్లిన అఖిల్ మహాజన్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించారు. ఆటోలో ప్రయాణించే వారికి రక్షణగా అభయ యాప్, క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. మహిళల రక్షణ కోసం పోలీస్ అక్క, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పేరిట షీటీంలను సమర్థవంతంగా నిర్వహించారు. బస్సులో ప్రయాణించే వారికి బస్సులో భరోసా కార్యక్రమాలతో ప్రతి బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. పోలీసుల్లో ఆత్మైస్థెర్యం పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహించారు.