జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన రమ్య నాలుగు నెలల గర్భిణి. తమ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో తన పేరును నమోదు చేసుకున్నది. ప్రతినెలా 16 కోడిగుడ్లు తీసుకుంటున్నది. అయితే మే నెలలో తీసుకున్న ఎగ్స్ పాడైనట్టు అనుమానించి నీటిలో వేసింది. రెండు మూడు మినహా అన్నీ తేలుతూ కనిపించడంతో ఆందోళన చెందింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు సైతం ఆమెతో కలిసి అంగన్వాడీ టీచర్ వద్దకు వెళ్లి ప్రశ్నించారు. ఈ పాడైన గుడ్లు తింటే పిల్ల పానానికి నష్టం జరగదా? అని ఆగ్రహించారు. దీంతో అంగన్వాడీ టీచర్ సైతం తన కేంద్రానికి పంపిణీ అయిన కోడిగుడ్లను తీసి నీటిలో వేసి చూడగా, వందల గుడ్లు తేలాయి. అయితే, ఎవరికి చెప్పాలో తెలియక మిన్నకుండిపోయింది. రమ్యను బతిమిలాడి మరో సారి జరుగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో సమస్య కొంత వరకు పరిష్కారమైంది.
అంగన్వాడీ కేంద్రాలకు సీగుడ్లు, పాడైపోయిన, చిన్న సైజు కోడిగుడ్లు పంపిణీ అవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో లభించే 60 గ్రాముల బరువు ఉండే గుడ్లతో సమానంగా రూ.6.14 చెల్లిస్తున్నా.. కాంట్రాక్టర్ల తీరుతో నాసిరకం, చిన్నసైజువి సరఫరా వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పంపిణీ దారులతో సర్కారు చేసుకున్న అగ్రిమెంట్, అందుకోసం జారీ చేసిన జీవోనే తప్పుడు విధానంలో ఉన్నట్టు తెలిసింది. కాంట్రాక్టర్లు జీవోలో ఉదహరించిన దాని కంటే చిన్నవి, నాసిరకం గుడ్లను పంపిణీ చేస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. గుడ్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. అధికారులు చోద్యం చూడడం విమర్శలకు తావిస్తున్నది.
జగిత్యాల, జూన్ 10 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలతోపాటు జనరల్ గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్స్, బీసీ, ఎస్సీ హాస్టల్స్, కస్తూర్బా కేంద్రాలకు కోడిగుడ్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నెలకు దాదాపు 28 కోడిగుడ్ల వరకు అందజేస్తున్నారు. ఇక రెసిడెన్షియల్స్‌లో విద్యార్థులకు వారంలో మూడుసార్లు కోడిగుడ్లను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కోడిగుడ్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర సర్కారు టెండర్లు నిర్వహించింది.
జగిత్యాల జిల్లాలో చూస్తే.. ప్రతి నెలా 17,78,682 కోడిగుడ్లు పంపిణీ చేసేలా, అందుకు ప్రతి గుడ్డుకూ రూ.6.14 పైసలు చెల్లించడానికి అంగీకారం కుదిరింది. అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 13.27 లక్షల కోడిగుడ్లు, మిగిలిన రెసిడెన్షియల్ పాఠశాలలకు నెలకు 3.91 లక్షల కోడిగుడ్లు పంపిణీ చేయాలని నిర్ధేశించింది. ఈ కోడిగుడ్లు 45 గ్రాముల నుంచి 52 గ్రాముల మధ్య ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కుళ్లిపోయిన, పాడైపోయిన గుడ్లు ఉండొద్దని నిబంధనలు విధించింది. కోడిగుడ్ల కోసం జిల్లాకు నెలకు రూ.1.09 కోట్లను వెచ్చిస్తుండగా, ఏడాదికి దాదాపు రూ.13 కోట్లకు పైగా చెల్లిస్తున్నది.
కోడిగుడ్ల పంపిణీకి రూపొందించిన నిబంధనల్లోనే లోపాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు (డైటీషియన్స్) ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సూచీల ప్రకారం కోడిగుడ్ల బరువుపైన నిర్ధేశితమైన విధానాలున్నాయని చెబుతున్నారు. డైటీషియన్స్ చెప్పిన సమాచారం ప్రకారం.. కోడిగుడ్లను మూడు రకాలుగా విభజిస్తారు. 38-42 గ్రామల మధ్య పరిమాణం ఉంటే స్మాల్ సైజ్ కోడిగుడ్డుగా గుర్తిస్తారు. 42 గ్రాముల నుంచి 52 గ్రాములు ఉన్నవి మిడిల్గా, 53-59 గ్రాముల మధ్య ఉన్నవి లార్జ్‌గా, అంతకు మించి 60-70 గ్రాముల మధ్య (ప్రస్తుతం మనం బజార్లో కొనుగోలు చేసేవి)ఉంటే ఎక్స్ట్రా లార్జ్‌గా పేర్కొంటారు.
పౌష్టికాహారం కావాలంటే మనిషి తీసుకునే కోడిగుడ్డు కనీసం 57 గ్రాములపైన ఉండాలని డైటీషియన్స్ చెబుతున్నారు. ఈ గుడ్డులో 33 గ్రాముల పరిమాణంలో వైట్సొన, 18 గ్రాముల బరువులో నీలం (పచ్చసొన), 6 గ్రాముల బరువులో గుడ్డు పైపెంకు ఉంటుందంటున్నారు. 33 గ్రాముల వైట్సొన, 18 గ్రాముల నీలం లేకుండా తీసుకునే కోడిగుడ్డు వల్ల మనిషికి పౌష్టికాహారం లభించదని పేర్కొంటున్నారు. డైటీషియన్స్ నిర్దేశితాలు ఇలా ఉంటే, ప్రభుత్వం దీనికి విరుద్ధంగా 45 నుంచి 52 గ్రాముల మధ్య బరువు ఉన్నవి పంపిణీ చేయాలని నిబంధనలు పెట్టడమే అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది.
టెండర్ దారులు కనీసం ప్రభుత్వం సూచించిన స్థాయిలోనైనా అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్స్‌కు కోడిగుడ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తున్నది. వీటి బరువు కనీసం 30 నుంచి 40 గ్రాములు సైతం తూగడం లేదు. కొద్ది నెలలుగా 30 నుంచి 35 గ్రాములవే పంపిణీ చేస్తున్నారు. అయితే, మే నెలకు సంబంధించి పంపిణీ చేసిన కోడిగుడ్లలో మెజార్టీవి పాడైపోయిన గుడ్లు కావడం, చిన్నవి కావడంతో విషయం బయటకి తెలిసింది. మార్కెట్లో అమ్మకానికి పెట్టిన ఒక కోడిగుడ్డును (ధర రూ.6.15 పైసలు) త్రాసులో వేస్తే 60 గ్రాముల బరువు తూగింది. అదే అంగన్వాడీకి పంపిణీ చేసిన కోడిగుడ్డును తూకం వేస్తే కేవలం 30 గ్రాముల బరువే ఉన్నది.
ఇలాంటివి పంపిణీ చేస్తున్నా అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయమై అంగన్వాడీ టీచర్లతో మాట్లాడితే.. ‘సార్ మాకేం తెలుసు. నెలనెలా ఒక వ్యక్తి వచ్చి మా కేంద్రంలో ఎంత మంది పిల్లలు? ఎంత మంది బాలింతలు, గర్భిణులు ఉన్నరు? అన్న లెక్కల ప్రకారం కోడిగుడ్లు పంపిణీ చేస్తడు. చాలా నెలల నుంచి ఇంతే సైజులో ఉన్న కోడిగుడ్లు పంపిణీ అవుతున్నయి. అప్పుడప్పుడు పాడైన గుడ్లు కూడా వస్తున్నయి. అయితే ఈ మే నెలలో మాత్రం డబ్బు, ఎనభై శాతం పాడైపోయిన గుడ్లే వచ్చినయి. సార్ మేమేం చేయగలం? చిన్న ఉద్యోగులం. మీరు రాస్తే మల్ల మమల్నే అంటరు’ అని వాపోయింది.
అంగన్వాడీలకు అందజేసిన కోడిగుడ్లను పరిశీలించిన చాలా మంది నిపుణులు, అవి నాసిరకంగా ఉంటున్నాయని తేల్చిచెబుతున్నారు. లేయర్ విభాగంలో కోళ్లు 45 రోజుల వయసు దాటిన తర్వాత గుడ్లు పెడుతాయని, దాదాపు మూడు నెలల వరకు గుడ్ల సైజ్ తక్కువే ఉంటుందని, 30 నుంచి 40 గ్రాముల కంటే తక్కువ బరువు తూగుతాయని వివరిస్తున్నారు. గుడ్లు పెట్టడం ప్రారంభమైన మూడు నెలల తర్వాత పెట్టే గుడ్లు 60 నుంచి 70 గ్రాముల మధ్య బరువులో ఉంటాయని పేర్కొంటున్నారు. సహజంగా కోడిగుడ్ల వ్యాపారం చేసే వ్యక్తులు బయట దేశాలకు, బహిరంగ మార్కెట్లోకి విక్రయానికి తెచ్చే గుడ్లన్నీ 60 నుంచి 70 గ్రాముల బరువు ఉంటాయని, అయితే లేయర్ కోళ్లు మొదటి మూడు నెలలు పెట్టే తక్కువ గ్రేడ్ గుడ్లను ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు.
30 నుంచి 40 గ్రాముల మధ్య ఉన్న గుడ్డు బహిరంగ మార్కెట్లో కనీసం రూ.4 ధర కూడా ఉండదని, ప్రభుత్వం నిర్ధేశించిన 45 నుంచి 52 గ్రాముల మధ్య బరువు ఉంటే రూ.5 నుంచి రూ.5.50 పలుకుతుందని, అదే లక్షల సంఖ్యలో కొనుగోలు చేస్తే రూ.4.50 నుంచి రూ.5 మధ్యనే ఉంటుందని చెబుతున్నారు. సర్కారు చెల్లించే రూ.6.14 ధర ప్రకారం చూస్తే 60 గ్రాముల బరువు ఉన్న కోడిగుడ్లను పంపిణీ చేయవచ్చని పేర్కొంటున్నారు. అయితే, ఈ లెక్కన కోడిగుడ్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంగన్వాడీలకు పంపిణీ చేసే నాసిరకం, తక్కువ సైజ్ కోడిగుడ్ల గురించి జగిత్యాల జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ దృష్టికి ‘నమస్తే తెలంగాణ’ తీసుకువెళ్లగా, ‘మా దృష్టికి రాలేదు. ఎక్కడ పంపిణీ అయ్యాయి? ఏ సెక్టార్లో పంపిణీ అయ్యాయి?’ అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి ఉందని చెబుతున్నారనగా, ‘మీరు చెప్పారుగా.. ఏ క్లస్టర్లో నాసిరకం గుడ్లు వచ్చాయన్న వివరాలు ఇవ్వండి. అక్కడ మా సీడీపీవో, సూపర్వైజర్లతో విచారణ చేయిస్తాం’ అని సమాధానమిచ్చారు.