రామగుండంలోని ఆర్జీ-3 ఓసీపీ-2 పరిధిలోని ఓబీ కుప్పల్లోని మట్టి లూటీ అవుతున్నది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన ఓ కాంగ్రెస్ నేత ఈ మట్టి తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని, సింగరేణి, జిల్లా మైనింగ్ అధికారులను ప్రభావితం చేసి సీనరేజీ డబ్బులు చెల్లించకుండానే మట్టిని కొల్లగొడుతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. ఇరువై రోజులుగా నిరంతరాయంగా మట్టి తరలించినా, సింగరేణి జిల్లా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఆరోపణలకు తావిస్తున్నది.
పెద్దపల్లి, మే 17 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో నేషనల్ హైవే, నాలుగు లేన్ల రోడ్డు, రాజాపూర్ రోడ్డు విస్తరణ జరుగుతుండగా, ఆయా కంపెనీలు ఓసీపీ-2 పరిధిలోని ఓబీ కుప్పల్లోని మట్టిని తరలిస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన ఓ కాంగ్రెస్ నేత సరికొత్త దందాకు తెరతీశాడనే విమర్శలున్నాయి. అధికారులను మచ్చిక చేసుకొని మట్టిని కొల్లగొడుతూ ప్రైవేట్ అవసరాలకు తరలించాడు. వందలాది లారీల్లో మట్టిని తీసుకొచ్చి బేగంపేట-రత్నాపూర్ ప్రధాన రహదారి పక్కన బొక్కలవాగు సమీపంలో ఉన్న లోతైన పంట పొలాల్లోని తన ప్లాట్లలో బరంతీ నింపాడు.
దాదాపుగా రూ.50లక్షల విలువైన మట్టిని అక్రమంగా తరలించాడనేనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నేత మట్టి తరలింపును ఆసరాగా చేసుకున్న మరికొంత అధికార పార్టీ నాయకులు సైతం ఇదే వ్యాపారాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సర్కారు ఆదాయానికి గండి కొడుతూ లక్షలాది రూపాయల విలువైన ఓబీ మట్టిని అక్రమంగా తరలిస్తున్నా, ఆర్జీ-3 సింగరేణి అధికారులుగానీ, జిల్లా మైనింగ్ శాఖ అధికారులు గానీ పట్టించుకున్న పాపానా పోవడం లేదని, మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సింగరేణి, మైనింగ్ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా, అందుబాటులోకి రాలేదు.