కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన మరోసారి వివాదంలో చిక్కుకున్నది. రెండేళ్ల కింద తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఉండగా, అప్పుడు ఖర్చు చేసిన నిధుల విషయంలో దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు జడ్పీ చైర్‌పర్సన్‌గా కనుమల్ల విజయ కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగింది. కానీ, అది వాస్తవమా.. అవాస్తవమా? అనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.
దీంతో మరోసారి ఈ విషయమై ఆరోపణలు రావడంతో ఇటు వైద్య విధాన పరిషత్, అటు డీఎంఈ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. నిధులు దుర్వినియోగం కాలేదని, లెక్కలు అప్పగించడంలో నిర్లక్ష్యం మాత్రమే జరిగిందని అధికారులు వాదిస్తుండగా, రెండేళ్ల కింద డీఎంహెచ్‌వో చేసిన విచారణలో కోట్లాది రూపాయలు దుర్వినియోగమైనట్టు వెల్లడవుతోందని కొందరు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానపై రెండేళ్ల క్రితం నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు విచారణ జరిపించాలని అప్పటి జడ్పీ చైర్పర్సన్, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ అయిన కనుమల్ల విజయ 2023 డిసెంబర్ 11న కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె అప్పటి డీఎంహెచ్‌వో లలితాదేవిని విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన డీఎంహెచ్‌వో గతేడాది జనవరి ఒకటిన కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.
అయితే, ఆ విచారణలో కొన్ని నిధులు ఖర్చు చేయకుండా వదిలేశారని, ఖర్చు చేసిన నిధులకు బిల్లులు, రసీదులు, యూసీలు సమర్పించ లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా 2021-22లో అన్‌టైడ్ (హెచ్‌డీఎస్) కింద దవాఖానకు 5 లక్షలు, 2022-23లో 2.50 లక్షలు విడుదల కాగా, వీటిని ఖర్చు చేయకుండానే యూసీలు, ప్రొసీడింగ్‌లు సమర్పించినట్లు విచారణలో తేలింది.
2022-23లో కాయకల్ప కింద వచ్చిన 6 లక్షల నుంచి కేవలం 1.50 లక్షలు మాత్రమే ఖర్చు చేసి యూసీలు, ప్రొసీడింగ్‌లు సమర్పించిన అధికారులు, అందుకు సంబంధించిన బిల్లులు మాత్రం చూపలేదని విచారణ నివేదికలో ఉంది. అంతే కాకుండా, ఒక బ్యాంకు ఖాతా నుంచి 2021-22లో 53,05,200.98, 2022-23లో 65,56, 883.47, 2023-24లో 8,59,994.8 ఖర్చు చేసిన బిల్లులు, రిసిప్ట్లు సమర్పించ లేదని, మరో బ్యాంకు ఖాతా నుంచి 2022-23లో 35,55,398.07కు, 2023-24లో 16,06,072కు సంబంధించిన బిల్లులు సమర్పించ లేదని విచారణ నివేదికలో స్పష్టం చేశారు.
అంతే కాకుండా 2022 నుంచి 2024 వరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు (టీవీవీపీ) వచ్చిన నిధులకు సంబంధించిన యూసీలు కూడా సమర్పించ లేదని తేలింది. అలాగే, మెడిసిన్ అండ్ సర్జికల్ కోసం వచ్చిన నిధులకు సంబంధించి లెక్కలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన ఓచర్లు సమర్పించ లేదని స్పష్టమైంది. టీవీవీపీ నుంచి 2019 నుంచి 2023 వరకు వచ్చిన నిధులకు, టీఎస్ఎంఎస్ఐటీసీ నుంచి 2020 మే 16 నుంచి 2023 జనవరి 3 వరకు ఖర్చులకు సంబంధించిన నివేదికలు ఇచ్చినా ఓచర్లు సమర్పించ లేదని వెలుగుచూసింది.
పెట్రోల్ బంక్‌కు ఇచ్చింది ఎంత?
కొవిడ్ సమయంలో అత్యవసర సేవలు అందించే లక్ష్యంతో వాహనాలకు డీజిల్ కోసం వాడుకున్న బిల్లులకు సంబంధించిన వివరాలు కూడా అప్పటి అధికారులు పూర్తి స్థాయిలో సమర్పించనట్లు తెలుస్తున్నది. స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్‌బంక్‌కు 2022 ఏప్రిల్ 21న 99,925, అదే ఏడాది జూన్ 27న 99,919, సెప్టెంబర్ 13న 99,945, అక్టోబర్ 6న 99,847 మొత్తం 3,99,636 చెల్లించినట్టు ఉన్నది. కానీ, 1,62,618కి మాత్రమే బిల్లులు ఉన్నట్టు తేలింది.
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ అయిన కొవిడ్ బాధితులను తరలించేందుకు వాహనాలు సమకూర్చమని చెప్పినందుకు ఓ ప్రజాప్రతినిధి పేరిట డీజిల్ ఖర్చులని 44,536 రాసినట్లు నివేదికలో ఉంది. దీనికి సంబంధించిన లాగ్ బుక్‌ను సమర్పించకపోగా, బిల్లులు కూడా ఇవ్వనట్టు నివేదికలో పేర్కొన్నారు.
రెండేళ్లుగా పెండింగ్‌లోనే నివేదిక
దవాఖానలో నిధులకు లెక్కలు లేకపోవడం, సరైన బిల్లులు సమర్పించక పోవడంతో జరిగిన విచారణపై రెండేళ్లుగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలు 4.50 కోట్ల అవినీతి జరిగిందని, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు చేయకుండానే నొక్కేశారని చేస్తున్న ఆరోపణలు ఎంత వరకు నిజమనేది తేల్చాల్సి ఉంది. నిజానికి విచారణ సమయంలో బిల్లులు అన్ని సమర్పించామని, విచారణ అధికారి సరిగ్గా పరిశీలించకుండా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారని అధికారులు వాదిస్తున్నారు.
అయితే, ఈ పరిణామాలకు బాధ్యుడిని చేసి ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని అప్పట్లో సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. బాధ్యులైన అధికారులకు మాత్రం పదోన్నతులు కల్పించి ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు సంబంధిత బిల్లులు సమర్పించని కారణంగానే రెండేళ్ల తర్వాత ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, విచారణ అధికారిగా వ్యవహరించిన అప్పటి డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవి విచారణ సమయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, యూసీలు, రిసిప్ట్లు ఆ తర్వాతనైనా సమర్పించినట్టయితే ఈ వివాదం అంతటితోనే సద్దుమణిగేదనే చర్చ జరుగుతున్నది.
విచారణ జరిపిన రాష్ట్ర స్థాయి అధికారులు
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ వివాదంపై మరోసారి విచారణ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు టీవీవీపీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సూర్యశ్రీరావు, ఏఎఫ్‌వో యాదగిరితోపాటు డీఎంఈ నుంచి అడిషనల్ డీఎంఈ అడ్మిన్ అనితాగ్రేస్, ఏఎఫ్‌వో వై శ్రీనివాస్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ రెండు బృందాలుగా వచ్చి వేర్వేరుగా విచారణ జరిపారు. 4.50 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో ఎంత వరకు వాస్తవం ఉంది?
బిల్లులు తీసుకోకుండా పెట్రోల్ బంక్‌కు చెల్లింపులు ఏ విధంగా చేశారు? ఓ ప్రజాప్రతినిధి సిఫారసు మేరకు డీజిల్ ఖర్చులు చెల్లించి తన పేరిట ఎలా రాశారు? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతే కాకుండా ఈ దవాఖాన 2023 నవంబర్ ఒకటి నుంచి మెడికల్ కళాశాలకు అనుబంధంగా మార్చడంతో టీవీవీపీ నుంచి డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. అప్పడే దీనికి సంబంధించిన రికార్డులు, బ్యాంకు ఖాతాలన్నింటినీ డీఎంఈకి సమర్పించాల్సి ఉంటుంది. కేవలం రికార్డులు మాత్రమే అప్పగించిన అధికారులు 2023 నవంబర్ 7న స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఖాతా నుంచి 5 లక్షలు విడిపించినట్లు చర్చ జరుగుతున్నది.
అంతే కాకుండా, దవాఖాన నిర్వహణకు ఏదైనా ఒకే బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోతుందని, కానీ, ఇక్కడ మాత్రం రెండు ఖాతాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు స్పష్టమవుతున్నది. వీటిపైనా రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తున్నది. అయితే, ప్రతి సంవత్సరంలో ఆడిట్ నిర్వహిస్తున్నప్పటికీ ఈ లోపాలు సంబంధిత అధికారుల దృష్టికి ఎందుకు వెళ్లలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ వెళ్లినా అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో డీఎంఈ, టీవీవీపీ అధికారులు ఆడిట్ నివేదికలను కూడా పరిశీలించినట్లు తెలిసింది. అసలు ఈ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందా..? నిధులు ఖర్చు చేసినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా బిల్లులు సమర్పించ లేదా..? అనే విషయం తేలాల్సిన అవసరం ఉన్నది.