రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో 2,90,396 కోట్లతో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి సమ్మిళతంగా ఉన్నదని, సకల జనుల ఆకాంక్షకు అద్దం పట్టేలా ఉన్నదని ప్రతి ఒక్కరూ అభివర్ణించారు. ఈ పద్దుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మానవీయకోణాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. ‘బడ్జెట్ చాలా జనరంజకంగా ఉన్నది. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం దక్కింది. అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉన్నది’ అని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. రాష్ట్ర బడ్టెట్‌పై స్పందించారు.
భారీ పద్దు.. బ్రహ్మాండంగా ఉన్నది..
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన భారీ పద్దు బ్రహ్మాండంగా ఉంది. బడుగు, బలహీనవర్గాల వారితోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి వర్గానికీ ఆమోద యోగ్యంగా కేటాయింపులు జరిగాయి. రైతుల రుణమాఫీ కోసం రూ.6వేల కోట్ల కేటాయింపు హర్షనీయం. రుణాలన్నీ పూర్తిగా మాఫీ కానున్నాయి. నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు భారీగా కేటాయించడంతో రాష్ట్రం రానున్న రోజుల్లో వ్యవసాయ కేంద్రీకృత రాష్ట్రంగా మారిపోనున్నది. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన పద్దుతో సకల జనులందరికీ మేలు జరుగుతుంది.
– ఎం సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట..
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసినట్లుగా ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేశారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు వెచ్చించారు. మిషన్ భగీరథకు రూ.19,205కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్లో అభివృద్ధికి పెద్దపీట వేయడంతో పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలకు సైతం ప్రోత్సాహాన్ని అందించారు.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే రామగుండం
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గడం సాధ్యమైంది. రైతు బంధు, రైతు బీమా, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు వేదికలు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో రైతు బాంధవుడిగా మారారు. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం నియోజకవర్గానికి 2 వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించడం హర్షనీయం. ఈ సాయాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవల మహబూబ్‌నగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఇప్పుడు నిధులు కేటాయించడం, సీఎం దూరదృష్టికి నిదర్శనం.
-ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్‌టౌన్)
స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యం
బడ్జెట్లో స్థానిక సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పల్లె, పట్టణ ప్రగతి నిధులతో పాటే నేరుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థల ఖాతాల్లో బదిలీ చేయాలని నిర్ణయించడం హర్షణీయం. అలాగే విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించారు. గత బడ్జెట్ కంటే ఈసారి 3,008కోట్లు అధికంగా కేటాయిస్తూ మొత్తంగా విద్యారంగానికి 19,093కోట్లు కేటాయించడం శుభపరిణామం. వైద్యరంగంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, కొత్తగా 100 బస్తీదవాఖానలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్
దళితుల పక్షాన నా ధన్యవాదాలు
ఇటు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, అటు పేదలు, నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించే విధంగా బడ్జెట్ ఉన్నది. రోడ్లు, గృహాలకు భారీగా కేటాయించారు. ముఖ్యంగా అట్టడుగులో ఉన్న దళితుల కోసం రూ.17 వేలకుపైచిలుకు నిధులు కేటాయించారు. దీన్ని బట్టి దళితుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. దశల వారీగా ప్రాధాన్యత కింద తెలంగాణలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించే కృతనిశ్చయంతో రాష్ట్రం ఉన్నది. సీఎం కేసీఆర్‌కు మా దళితుల పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు. సాగు నీరు, వ్యవసాయ రంగానికి కూడా బడ్జెట్లో పెద్ద పీట వేశారు. ఆశా, అంగన్వాడీ, కాంట్రాక్టు బేసిక్‌లో ఉన్న చిరు ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చేందుకు బడ్జెట్‌ను పొందు పర్చారు. ఇది ఎంతో సంతోషదాయకమైన విషయం.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
అన్ని రంగాలకు సమప్రాధాన్యం
రాష్ట్ర బడ్జెట్ అన్ని అంశాల సమ్మేళనంతో కూడుకున్నది. ముఖ్యంగా ఆర్అండ్బీ రోడ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, విద్యా, వైద్యం, సంక్షేమం ఇలా ప్రతి అంశంలో సానుకూల కేటాయింపులు జరిగాయి. పాఠశాల విద్య, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలకు మంచి కేటాయింపులు జరిగాయి. పరిశ్రమలు, ఐటీ సెక్టార్‌కు కూడా భారీగా నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకు కేటాయింపులు జరిగాయి. ఈ వర్గం, ఆ వర్గం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరేలా కేటాయింపు జరిపారు. దళిత బంధుకు భారీగా కేటాయింపులు జరిగాయి. ఈ సారి రమారమి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఈ చిన్న రాష్ట్రంలో ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఇంత భారీ బడ్జెట్‌ను అందించినందుకు సీఎం కేసీఆర్, ఆర్ధిక మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– వొడితల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
అన్ని వర్గాలకు మేలు
రాష్ట్ర బడ్జెట్ సబండవర్గాల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేసేలా ఉంది. అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉన్నది. శాంతిభద్రతలు సజావుగా ఉండడం, సుస్థిర రాజకీయ పాలనా వ్యవస్థ కొనసాగుతుండడంతో విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తున్నాయి. రైతన్నలకు రుణ విముక్తులను చేయడం కోసం 6385కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగానికి 26,831కోట్లు కేటాయింపులు చేశారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 2వేల మందికి సాయం అందుతుంది. ఇది పేద, మధ్య తరగతి వర్గాలకు శుభవార్తే.
– దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే
సకల జనుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర బడ్జెట్ సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది. ప్రతి వర్గానికి, ప్రతి రంగానికి బడ్జెట్ కేటాయించారు. ఇంత చిన్న రాష్ట్రంలో అంతంత భారీ కేటాయింపులు జరుగడం మన రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్, సంక్షేమం, రహదారులు ఇలా ప్రతి రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ ఒక్క రంగాన్ని కూడా విస్మరించ లేదు. ఇప్పటికే వృద్ధి చెందుతున్న అనేక రంగాలు ఈ కేటాయింపులతో మరింత పురోగతిని సాధిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పేదలు, నిరుపేదల సంక్షేమానికి ఇంత భారీగా కేటాయింపులు జరిపిన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు. ఇది అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ఆశాజనకమైన బడ్జెట్‌గా అభివర్ణించవచ్చు. ముఖ్యంగా దళితుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. దళిత బంధు కింద 17 వేల కోట్లు ఖర్చుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబం ఈ రోజు హర్షిస్తున్నది. పొద్దున లేస్తే అనవసర ఆరోపణలు, విమర్శలు చేసే ప్రతిపక్షాలకు రాష్ట్ర బడ్జెట్ చెంపపెట్టులా నిలుస్తుందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
దేశానికే దిక్సూచి
బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం ఇచ్చిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు శుభాకాంక్షలు. రాష్ట్ర పద్దు దేశానికే దిక్చూచిగా నిలుస్తున్నది. 2014-15లో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా కేవలం 4.1శాతం మాత్రమే. అది 2020-21 నాటికి 4.9శాతానికి పెరిగింది. దేశ జనాభాలో తెలంగాణలో ఉన్నది కేవలం 2.9శాతం మాత్రమే. జీడీపీ విషయానికి వస్తే తెలంగాణ భాగస్వామ్యం 4.9శాతం కావడం మనందరికీ గర్వకారణం. నియోజకవర్గానికి 2వేల ఇండ్లు మంజూరు కాగా, పంచాయతీరాజ్‌శాఖకు 31,426కోట్లు , విద్యారంగానికి 19వేలకోట్లు కేటాయించడం హర్షనీయం. దళితబంధుకు, రుణమాఫీకి భారీగా కేటాయింపుల చేయడం గర్వకారణం.
– చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే
పేదలకు మేలు
ఇది పేదలకు ఉపయోగపడే బడ్జెట్. తెలంగాణ ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. ప్రతి వర్గానికి మేలు చేసేలా కేటాయింపులు చేశారు. విద్యా, వై ద్యరంగంతోపాటు, ఎస్సీ సంక్షేమం, దళిత బంధు, బీసీ సంక్షేమం, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దళితబంధు, ఎస్సీ ప్రత్యేక నిధి, విద్య రంగం, మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులతో ఆయా వర్గాలకు మేలు జరుగుతుంది. సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోలేని వారికి రూ.3లక్షల సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించారు. అన్నివర్గాలను సంతృప్తి పరుస్తూ బడ్జెట్‌ను రూపొందింపజేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే
పరిపాలన దక్షతకు నిదర్శనం
సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనం ఈ బడ్జెట్. ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై అత్యంత చిత్తశుద్ధితో రూపొందించారు. వారం రోజుల కిందటి కేంద్ర బడ్జెట్, ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, మైనార్టీ, మహిళ శిశు సంక్షేమ శాఖలకు అత్యల్పంగా నిధులు కేటాయిస్తే, రాష్ట్ర సర్కారు ఆయా వర్గాలకు పెద్దపీట వేస్తూ సింహభాగం నిధులు కేటాయించింది. వ్యవసాయ రంగానికి కేంద్రం 31 శాతం నిధులు తగ్గిస్తే, రాష్ట్రం భారీగా కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అంశాన్ని ఎత్తివేస్తే రాష్ట్రం 90వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిధులు కేటాయింపులు చేసింది. ఇలా ప్రతి రంగాన్ని కేంద్ర విస్మరిస్తే.. తెలంగాణ కడుపులో పెట్టుకొని మేమున్నామని నిరూపించింది.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్
అభివృద్ధి, సంక్షేమానికి పట్టం..
రాష్ట్ర బడ్జెట్ ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంది. అభివృద్ధి, సంక్షేమాలకు పట్టం కడుతూ సబ్బండ వర్గాలకు సమన్యాయం చేసేలా రూపొం దించారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశారు. సంక్షేమానికి పట్టంకట్టారు. దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు భారీ కేటాయింపులు చేశారు. పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. కొత్త ఇండ్ల పథకం హర్షనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలుస్తుంది.
– న్యాలకొండ అరుణ, జడ్పీ చైర్పర్సన్, రాజన్న సిరిసిల్ల