కార్పొరేషన్ మే 1 : కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని డంపింగ్ యార్డు నుంచి వస్తున్న పొగతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని దీనిపై వెంటనే చర్యలు తీసుకొని తమ ఆరోగ్యాలను కాపాడాలని కోరుతూ గురువారం ఉదయం నగరంలోని అలకాపురి కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. డంపింగ్ యార్డ్ నిర్మూలన ఆరోగ్య పరిరక్షణ సమితి పేరుతో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డంపింగ్ యార్డ్ లో గత కొంతకాలంగా మంటలు లేస్తూ విపరీతమైన పొగ వస్తుంది.
దీని వల్ల అలకాపురి, ఆటోనగర్, హైదరాబాద్ బైపాస్ రోడ్ ,రాంపూర్, లక్ష్మీ నగర్ తదితర కాలనీవాసులు అనునిత్యం వెలువడే పొగ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంటలను అదుపు చేసే విషయంలో నగరపాలక అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సంవత్సర కాలంగా ఆయా కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారని, అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన ఎవరూ పట్టించుకోవడం లేదని అందుకే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని కాలనీవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జలంధర్, కాలనీవాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.