సుల్తానాబాద్, జూన్ 1 : సుల్తానాబాద్‌లో లారీ బీభత్సం వెనుక నిర్లక్ష్యమే అసలు కారణంగా కనిపిస్తున్నది. డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి రోడ్డుపై ప్రమాదకరంగా వెళ్తుండగా.. వెనుకే వస్తున్న ఓ వాహనదారుడు గుర్తించి, డయల్ 100కు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతున్నది. అయితే అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే భారీ ప్రమాదం తప్పేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళ చనిపోగా.. ఆమె కొడుకు పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది.
అసలేం జరిగిందంటే..శుక్రవారం సాయంత్రం సుల్తానాబాద్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపుతప్పింది. పూసల రోడ్డు చౌరస్తా వద్ద రోడ్డుపై ముగ్గురిని ఢీకొని రాంగ్రూట్లో రైట్ సైడ్‌కు వెళ్లింది.
మళ్లీ డివైవర్ ఎక్కి లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఆరు బైక్‌లు, గప్‌చుప్ బండిని ఢీకొట్టుకుంటూ.. చివరికి ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఆ చెట్టు లేకపోతే భారీ ప్రమాదమే జరిగేది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా, అందులో ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ నసీమా శనివారం చనిపోయింది. ఆమె కొడుకు దిలీష్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
అయితే ఈ ప్రమాదానికి ముందు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో లారీ అదుపు తప్పి రోడ్డుపై అటూ ఇటూ ప్రమాదకరంగా వెళ్తుండగా.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి నుంచి వెనుకే వస్తున్న ఓ వాహనదారుడు గమనించి, వీడియో తీస్తూ.. సుల్తానాబాద్‌కు మూడు నాలుగు కిలోమీటర్ల ముందే డయల్ 100కు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఈ ముప్పు తప్పి ఉండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నారు.