Suicide | కరీంనగర్ : కరీంనగర్‌లోని అక్షర చిట్ ఫండ్ ఏజెంట్ చింతల రాజయ్య (రాజు) శనివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన రాజు అక్షర చిట్ ఫంగఃలో ఏజెంటుగా పని చేస్తూ అనేక మందితో చిట్టీలు వేయించాడు. తన అక్కతో పాటు ఇతర బంధువులతో కూడా ఈ సంస్థలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించాడు. తాను కూడా రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. గత కొద్ది రోజుల కింద అక్షర చిట్ ఫండ్ మూసివేశారు.
బాధితుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చిట్ ఫండ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటు కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజు ద్వారా చిట్స్ వేసిన బాదితులు, ఆయన బంధువులు తమ డబ్బులు తమకు ఇప్పించాలని గత కొంత కాలంగా ఒత్తిడి తెస్తున్నారు. చిట్ ఫండ్ నిర్వాహకుల చుట్టూ తిరిగినా వారు స్పందించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజు శనివారం అర్ధరాత్రి మల్కాపూర్‌లోని తన ఇంటి వెనక జామచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కరీంనగర్ ప్రభుత్వ దవాఖానా వద్ద మల్కాపూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని, అక్షర చిట్ ఫండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.