Shift Dussehra holiday | గోదావరిఖని : సింగరేణి లో దసరా పండుగ సెలవు ను అక్టోబర్ 2 కు బదులుగా 3 కు మార్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో గనులు, డిపార్ట్మెంట్స్, ఓసీపీ-5 లలో అధికారుల కు సోమవారం వినతి పత్రాలు అందజేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ-వన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను జీడీకే-2వ ఇంక్లైన్, ఏరియా హాస్పిటల్లలో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ జాతిపిత మహాత్ముడైన గాంధీ జయంతి అక్టోబర్ 2న దసరా పండుగను అత్యంత వైభవంగా సింగరేణి ఉద్యోగులు జరుపుకునేందుకు ఇబ్బందిగా మారిందన్నారు. పండుగ రోజున గనుల పైన మేకలతో మైసమ్మ పూజలు చేస్తూ సంవత్సర కాలమంతా నిర్దేశిత లక్ష్యసాధనలో మాకు ఎటువంటి ప్రమాదములు జరగరాదని భావోద్వేగంతో, భక్తి పారవశ్యంతో అమ్మవారిని కోరుకుంటారని వారు తెలిపారు. ఆ సందర్భంగా అమ్మవారి మొక్కు తీర్చునప్పుడు మద్యం ప్రధాన భూమిక పోషిస్తుందని, పూజకు సంబంధించిన అవసరమైన ప్రధాన వనరులు అక్టోబరు 2 న చేసే అవకాశం లేదని, సెలవు దినాన్ని మార్చాలని వారు కోరారు.
ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ నాయకులు సిద్దమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం పాషా, ఎరవెల్లి రాజయ్య, గుర్రం ప్రభుదాస్, చంద తిరుపతి, నాయిని శంకర్, గొడిశల నరేశ్, ఎం.చక్రపాణి, చెప్యాల భాస్కర్, బలుసు రవి, దొంత సాయన్న, బండి మల్లేష్ బి.సమ్మయ్య, దాసరి శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్, ఆర్ వెంకట స్వామి, ఎం సత్యనారాయణ, దాసరి అనిల్, వేముల అశోక్, సంతోష్, బీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.