AITUC | గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు కోసం ప్రవేశ పెట్టిందని, దీని వల్ల దేశంలో ఉన్న కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం పేర్కొంది. వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి, గతంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను సింగరేణి లో కూడా కాంట్రాక్టు కార్మికులు జయప్రదం చేయాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ వన్ బ్రాంచి అధ్యక్షులు ఎం.ఎ.గౌస్ కోరారు.
భాస్కర్ రావు భవన్ లో శనివారం సమ్మె వాల్ పోస్టర్స్ ను ఆయన పలువురు నాయకుల తో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక వర్గాన్ని బానిసత్వ పరిస్థితులను పెంపొందించే విధంగా ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కు వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా కార్మిక కోడులను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని, కార్మికుల ప్రయోజనాల ను, చట్టాలను కాపాడాలని దేశ వ్యాప్తంగా 27 సార్లు సమ్మె చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో దాదాపు 50 కోట్ల మంది కార్మికులు పాల్గొన నున్నారని, దీన్ని బట్టి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుందని ఆయన అన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, వారి సంక్షేమం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఈ సమ్మె లో కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు అబ్దుల్ ఘని, సీపీఐ నగర సహాయ కార్యదర్శి తాళ్లపెళ్లి మల్లయ్య, నాయకులు జైపాల్ రెడ్డి, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.