Flight | ఏపీలోని గన్నవరం నుంచి ముంబయికి విమాన సర్వీసు శనివారం ప్రారంభమైంది. జనసేన ఎంపీ బాలశౌరి, కేశినేని చిన్ని ఎయిర్ ఇండియా విమానాన్ని ప్రారంభించారు. కొత్త ప్రభుత్వంలో వేగంగా ఏపీ అభివృద్ధి చెందాలని.. రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్నారు. ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్‌లైన్ సర్వీసెస్ కావాలన్నారు. క్యాపిటల్‌కు కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ముంబయికి విమానం కనెక్టివిటీ ప్రయాణికులకు సులువగా ఉంటుందన్నారు. గతంలో వీటిపై చాలా అర్జీలు పెట్టామన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాజధాని ప్రాంతం కావడంతో ప్రయాణికుల రద్దీ ఉంటుందని.. ఢిల్లీ విమానాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయన్నారు. ఈ విషయంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో మాట్లాడుతున్నామని.. కొత్త టెర్మినల్ త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఇకపై సీఐఎస్ఎఫ్ భద్రత అందుబాటులోకి రాబోతున్నది. జులై 2 నుంచి అమలులోకి రానున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటి వరకు ఎస్పీఎఫ్, స్పెషల్ పోలీస్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో భద్రత పర్యవేక్షిస్తుండగా.. ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భద్రత కల్పిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు.