కమాన్పూర్, ఫిబ్రవరి 14: దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని మోదీ సర్కార్ హరిస్తుందని ఏఐఎఫ్ టీయూ(AIFTU )రాష్ట్ర నాయకులు మాతంగి రాయమల్లు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరి సదానందం ఆరోపించారు. కమాన్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఈ నెల 23న గోదావరిఖనిలో నిర్వహించే ఏఐఎఫ్ టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరిగిపోతున్న కార్పొరేటీకరణతో కార్మికులను కార్మికులుగా గుర్తించలేని అస్థిత్వ సమస్య ఏర్పడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా కుదించిందన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థల వల్ల శ్రమ దోపిడి తీవ్రం చేసిందని విమర్శించారు. పర్మినెంట్ ఉద్యోగాలు, హక్కులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేని వేతన బానిస వ్యవస్థను తయారు చేసిందని మండిపడ్డారు. కులం, మతం పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ మనిషికి మనిషికి మధ్య అంతరాలను పెంచుతుందన్నారు. ఖనిజ సంపదను అంబాని, ఆదానిలకు కట్టబెట్టడానికి కేంద్ర మంత్రి అమిత్ షా ఆదీవాసీలపైకి పోలీసు బలగాలను, ప్రైవేట్ సైన్యాన్ని ఉసిగొల్పి నరమేధం సాగిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్రజాస్వామిక పద్ధతుల్లో కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రంలోని భూములను కారుచౌకగా దారదత్తం చేస్తున్నారని ఆరోపించారు. నేడు దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నూతన ప్రజాస్వామిక విప్లవమే మార్గమన్నారు. గోదావరి ఖనిలో నిర్వహించే రాష్ట్ర కౌన్సిల్ సభను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి టి. రత్నకుమారి, హమాలీ కార్మికులు కొలిపాక శంకర్, సాయికుమార్, రాజయ్య, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.