కంఠేశ్వర్, ఫిబ్రవరి 18: ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 24,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 144 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు ఉంటాయని తెలిపారు. ఫస్టియర్ పరీక్షకు 19,299 మంది, సెకండియర్ పరీక్షలకు 17,664 మంది కలుపుకొని మొత్తం 36,963 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉండాలన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అవకతవకలకు పాల్పడితే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యుత్, ఆర్టీసీ, వైద్య శాఖ అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమా ర్, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి రవికుమా ర్, డీఈవో అశోక్, ఏసీపీ మస్తాన్అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.