వికారాబాద్: తనకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. ఇటీవల సీఎం షెడ్యూల్లో లేకపోయినప్పటికీ పరిగిలో బహిరంగ సభ పెట్టించిన రామ్మోహన్‌రెడ్డికి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలు శాపంగా మారాయనే చర్చ జరుగుతున్నది. రెండున్నరేండ్లుగా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తూ వస్తున్న రామ్మోహన్‌రెడ్డికి సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డే బహిరంగ సభ వేదికగా మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి మున్సిపల్ మంత్రి అంటూ ప్రకటించారు. దీంతో రామ్మోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించడంతో రామ్మోహన్‌రెడ్డి అయోమయంలో పడిపోయారు. రామ్మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ప్రకటనతోపాటు తాండూరుకు వెయ్యి కోట్ల నిధులిస్తామని హామీనివ్వడం చూస్తే పరిగి ఎమ్మెల్యేకు ఇక మంత్రి పదవి రాదనేది సీఎం క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జిల్లా అంతటా జోరందుకున్నది.